సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించిన క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ముంబైలోని తన కార్యాలయాన్ని మూసివేసినట్లు సమచారం.
తాజా నివేదిక ప్రకారం ముంబైలోని తన కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేసింది ఉబెర్. అయితే సేవలను మాత్రం కొనసాగించనుంది. ముంబైలోని ఉబెర్ ఉద్యోగులు ఇంటి నుండి డిసెంబర్ వరకు పనిచేయనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఉబెర్ ప్రతినిధి నిరాకరించారు. ప్రపంచవ్యాప్తంగా 6,700 మంది, దేశీయంగా 600 మందిని తొలగించిన దాదాపు నెల తరువాత ఈ పరిణామం చోటు చేసుకోనుంది. (ఉబెర్ : ఇండియాలో 600 మంది తొలగింపు)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (క్యూ 1 2020) మొదటి త్రైమాసికంలో, ఉబెర్ నికర నష్టం 163 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 1.1 బిలియన్ డాలర్ల నష్టం ఈ ఏడాది 2.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం సంవత్సరానికి 14 శాతం పెరిగి 3.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
కాగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను ఏకీకృతం చేసే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 45 కార్యాలయాలను మూసివేయాలని ఉబెర్ నిర్ణయించింది. ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి తమ ప్రధాన వ్యాపారంపై దృష్టిని రీఫోకస్ చేయనున్నామని ఇటీల ప్రకటించారు. ఆహారం, కిరాణా సామాగ్రి డెలివరీలపై దృఫ్టి కేంద్రీకరించనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment