విండోస్ ఎక్స్‌పీకి ఇక సెలవు..
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపరేటింగ్ సిస్టం విండోస్ ఎక్స్‌పీకి నేటితో తెరపడనుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దీనికి మంగళవారం నుంచి సాంకేతిక సహకారాన్ని నిలిపివేయనుంది. ఫలితంగా ఇకపై సెక్యూరిటీ అప్‌డేట్స్, పెయిడ్ రూపంలో గానీ ఉచితంగా గానీ సపోర్ట్ లభించదు. అలాగే ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌నకు ఆన్‌లైన్‌లో టెక్నికల్ కంటెంట్ అప్‌డేట్ కూడా ఉండదు. దీంతో ఎక్స్‌పీపై ఆధారపడిన కంప్యూటర్లకు సైబర్ నేరాల నుంచి రిస్కులు మరింత పెరగనున్నాయని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హెచ్చరించింది.
భారత్‌లోని పెద్ద సంస్థల్లో సుమారు 40 లక్షల పర్సనల్ కంప్యూటర్లలో ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ అంచనా వేసింది. వీటిలో ఇప్పటికే 84 శాతం కంప్యూటర్లు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లకు మారాయి. విండోస్ ఎక్స్‌పీని తొలిసారిగా 2001 అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు చలామణీలో ఉన్న వెర్షన్‌ని ఎక్స్‌పీ సర్వీస్ ప్యాక్ 3గా వ్యవహరిస్తున్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఓఎస్‌తో పోలిస్తే విండోస్ ఎక్స్‌పీ మూడు తరాల పాతది. 2012 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన విండోస్ 8 .. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం.
ఏటీఎంలకు విఘాతం?
అప్‌గ్రేడ్ కావాల్సిన 16 శాతం పర్సనల్ కంప్యూటర్స్‌తో పోలిస్తే .. అప్‌గ్రేడ్ చేయాల్సిన ఏటీఎంల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 1,00,000 పైచిలుకు ఏటీఎంలు ఉండగా, సింహభాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8 నుంచి ఎక్స్‌పీకి సపోర్ట్ నిల్చిపోతుండటంతో కార్యకలాపాలకు విఘాతం కలగకుండా తగిన ఏర్పాట్లు తక్షణమే తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గతంలోనే బ్యాంకులను ఆదేశించింది. మరోవైపు, కొత్త ఏటీఎంలన్నీ కూడా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లపైనే పనిచేస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎంవీ టంకశాల తెలిపారు. కొన్ని పాత ఏటీఎంలు మాత్రమే ఎక్స్‌పీపై పనిచేస్తున్నాయని, వీటిల్లో పరిమిత స్థాయిలోనే సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.