భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఇదేనట..! | Indian students want this dream job more than Facebook or Disney | Sakshi
Sakshi News home page

భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఇదేనట..!

Published Tue, Aug 23 2016 8:51 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఇదేనట..! - Sakshi

భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఇదేనట..!

భారతీయ విద్యార్థుల కలల ఉద్యోగం ఏమిటని...? అడిగితే, టక్కున వారి నోట వచ్చే మాట టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థల పేర్లు. ఆ కంపెనీల తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే ఉద్యోగ సంస్థ ఏమిటో తెలుసా..?  దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు, ద్రవ్య నియంత్రణకు అత్యున్నత సంస్థగా నిలుస్తున్న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియానేనట. ఆర్బీఐ అత్యంత ఇష్టమైన ఉద్యోగాల్లో ఒకటిగా నిలుస్తోందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. గూగుల్, యాపిల్ల తర్వాత అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియానే నిలుస్తోందట.  యూనివర్సమ్ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సర్వే వెల్లడించిన ఇండియన్ స్టూడెంట్స్ డ్రీమ్ జాబ్ సర్వేలో ఆర్బీఐ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అమెరికన్ టెక్ దిగ్గజాలు ఫేస్ బుక్, మైక్రోసాప్ట్, డిస్నీలను అధిగమించి ఆర్బీఐ ఈ స్థానాన్ని కైవసం చేసుకుందని యూనివర్సమ్ తెలిపింది.

మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) విద్యార్థులు మాత్రం ఎక్కువగా వెస్టరన్ కంపెనీలపై మొగ్గుచూపుతున్నారని యూనివర్సమ్ వెల్లడించింది. అయితే ఇక్కడ కూడా ఆర్బీఐ ఐదో స్థానంలో నిలిచిందని సర్వే తెలిపింది.  మెకిన్సే, అమెజాన్, జేపీ మోర్గాన్, స్థానిక ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ల తర్వాత ఎంబీఏ విద్యార్థులు ఆర్బీఐలో ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని యూనివర్సమ్ పేర్కొంది. ఆర్బీఐ విజయోత్సవంలో కీలకమైన అంశం.. సంతృప్తికరమైన సిబ్బందినేనని సెంట్రల్ బ్యాంకు 2015 వార్షిక రిపోర్టులో వెల్లడించింది. అమెరికన్ టెక్ దిగ్గజాలను అధిగమించి ఆర్ బీఐ లాంటి సంస్థలు యువతను ఎక్కువగా ఆకట్టుకునే కంపెనీగా నిలవడం, విద్యార్థుల్లో ఆలోచన దృకోణం మారుతుందని తెలుస్తున్నట్టు సర్వే పేర్కొంది.

గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఆర్బీఐను విజయవంతమైన బాటలో నడిపిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. రాజన్ వారసుడిగా ఉర్జిత్ పటేల్ తదుపరి ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్ బీఐలో ఉద్యోగులుగా అర్హత పొందడానికి సంస్థ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా ఐఐఎమ్ ల్లో నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో అర్హత పొందాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement