ట్రంప్ పై వెనక్కి తగ్గిన టెక్ దిగ్గజాలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్‌బ్యాన్‌పై పోరాటానికి టెక్ దిగ్గజాలు వెనక్కి తగ్గాయి. ఏడు ముస్లిందేశాల ప్రజలపై విధించిన వీసా బ్యాన్‌పై ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్ సహా ఆరంభంలో తీవ్రంగా స్పందించిన దాదాపు 60 సంస్థలు ఈ పోరాటంనుంచి పక్కకు తప్పుకున్నాయి. ట్రంప్ జారీ చేసిన సెకెండ్ వెర్షన్ ఆర్డర్‌పై పోరాడేందుకు ఈ సంస్థలు నిరాకరించినట్టు తెలుస్తోంది.
సిలికాన్ వ్యాలీ కంపెనీల తరపున మంగళవారం హవాయి ఫెడెరల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మైక్రోసాఫ్ట్, ఈ బే ఇంటెల్ కార్ప్, నెట్‌ఫ్లిక్స్, ట్విట్టర్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలు సంతకం చేయలేదని సమాచారం. అయితే ఇంతకుముందు ఈ పోరాటంలో ఉన్న ఎయిర్ బీఎన్‌బీ, డ్రాప్‌బాక్స్, కిక్‌స్టార్ లాంటి ఇతర కంపెనీలు కొన్ని తాజా పిటిషన్ పై కూడా సంతకం చేశాయి. ట్రంప్ రెండవ బ్యాన్ ఆర్డర్ లో ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమన్ తదితర ఆరు ముస్లిం దేశాలపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన దావాను సమర్ధించకూడదని 58 టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించుకున్నాయిట. అయితే ఈ వార్తలపై ఆపిల్, గూగుల్, ఈబే, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు వెంటనే స్పందించేందుకు నిరాకరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెల ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించకుండా ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే అమెరికాలోని వివిధ కోర్టులు సహా, పలు టెక్ సంస్థల నిరసనల నేపథ్యంలో ఇరాక్‌ను మినహాయించి, ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికాకు రాకుండా సరికొత్త ప్రయాణ నిషేధాజ్ఞల (ట్రావెల్ బ్యాన్)ను ప్రకటించారు. మరోవైపు ఈ ఆదేశాలను సైతం హవాయ్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు మరికొన్ని గంటల్లో ఈ నిషేధం అమల్లోకి రానుండగా.. అధ్యక్షుడి తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు చట్టబద్ధంగా లేదంటూ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డెరిక్ వాట్సన్ దీనిని నిలిపివేసిన సంగతి తెలిసిందే.
కాగా ఒకవైపు అమెరికా కోర్టులు ట్రంప్ బ్యాన్‌పై స్థిరంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంటే.. మరోవైపు ముందు దూకుడును ప్రదర్శించిన టెక్ దిగ్గజాలు తాజాగా వెనక్కి తగ్గడం ఆసక్తికరంగా మారింది.