
కొత్త కార్ల జాతర..!
రానున్న కొద్ది నెలల్లో దేశీ మార్కెట్లోకి విడుదల...
అందుబాటులోకి కొత్త వేరియంట్లు కూడా..
అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ కార్ల కంపెనీలు కొత్త కొత్త మోడళ్లు, వేరియంట్‌లతో కొనుగోలుదారులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. రానున్న నెలల్లో కార్ల కొనుగోలుదారులకు పండగే పండుగ అని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో కొత్త కొత్త మోడళ్లు,వేరియంట్‌లు అందుబాటులోకి రానున్నాయి.
టాటా మోటార్స్ బోల్డ్, జెస్ట్...
ప్రయాణికుల కార్ల అమ్మకాల్లో గత రెండేళ్లలో టాటా మోటార్స్ బాగా దెబ్బతిన్నది. పూర్వవైభవం సాధించడం లక్ష్యంగా త్వరలో రెండు కొత్త మోడళ్లు, బోల్ట్, జెస్ట్‌లను రంగంలోకి తెస్తోంది. ఈ రెండు కార్లను విస్టా ప్లాట్‌ఫారమ్‌పైననే కంపెనీ తయారు చేస్తోంది. ఈ రెండు కార్లపై టాటా మోటార్స్ భారీగానే ఆశలు పెట్టుకుంది. కార్ల మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకి కంపెనీ సియాజ్, ఎస్‌ఎక్స్4 ఎస్ క్రాస్ కార్లను అందించనున్నది. మారుతీ ఎస్‌ఎక్స్4తో పోల్చితే పూర్తిగా కొత్తగా ఉండేలా సియాజ్ కారును కంపెనీ రూపొందిస్తోంది. ఇది కాకుండా ఎస్‌ఎక్స్4 ఎస్-క్రాస్‌ను కూడా అందిస్తోంది. రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానోల మాదిరి స్పేసియస్‌గా ఉండేలా ఈ కారును రూపొందించారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభ్యమవుతుంది.
మహీంద్రా కొరాండొ...
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొనుగోలు చేసిన దక్షిణ కొరియాకు చెందిన సాంగ్‌యాంగ్ కంపెనీ ఇటీవలనే కొరాండొ కారును దక్షిణ కొరియాలో విడుదల చేసింది. 2.01 డీవోహెచ్‌సీ 4- సిలిండర్ టర్బో చార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారులో 6 గేర్లతో ఆటోమేటిక్ వేరియంట్ కూడా లభ్యమయ్యే అవకాశాలున్నాయి. ఫియట్ కంపెనీ పుంటో హ్యాచ్‌బ్యాక్‌పై ఫియట్ అవెంచురను అందిస్తోంది. ఈ కారు ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో, టయోటా ఇటియోస్ క్రాస్ కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక లగ్జరీ కార్ల విషయానికొస్తే, మెర్సిడెస్ బెంజ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఏను అందించనున్నది. ఈ ఏడాది మే నుంచే ఈ కారుకు బుకింగ్స్ ప్రారంభం కావడం విశేషం. 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్‌బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి.
మారుతీ 3 వేరియంట్లు...
మారుతీ సుజుకి కంపెనీ ఎర్టిగ మోడల్‌లో ఆటోమాటిక్ వేరియంట్‌ను అందించునన్నది. ఇటీవలనే ఇండోనేసియాలో విడుదల చేసిన ఈ కారులో ఒక్క గేర్‌బాక్స్‌లోనే తేడా ఉంది. భారత్‌లో బాగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బాక్‌ల్లో మారుతీ సుజుకి స్విఫ్ట్ ఒకటి. ఎల్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ లైట్లు, బంపర్‌పై సిల్వర్ డిటైలింగ్ వంటి ఎక్స్‌టర్నల్ ఫీచర్లు అదనంగా ఈ కారులో కొత్త వేరియంట్‌ను అందిస్తోంది. డిజైర్ కారులో కొత్త వేరియంట్‌ను ఎల్ షేప్ ఎల్‌ఈడీ ఫీచర్‌తో మార్కెట్లోకి తెస్తోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ పోలో, వెంటో మోడళ్లలో కొత్త వేరియంట్లను తీసుకొస్తోంది. వెంటో వెనక భాగంలో ఎక్కువ మార్పులు ఉంటాయని అంచనా. హోండా కంపెనీ మొబిలో, జాజ్ మోడళ్లలో కొత్త వేరియంట్‌లను అందించనుంది.
కొత్త హెడ్‌ల్యాంప్స్, వింగ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్లు, 390 లీటర్ల బూట్ స్పేస్‌వంటి ఫీచర్లతో జాజ్‌ను రంగంలోకి తెస్తోంది. ఎక్సైటింగ్ హెచ్ డిజైన్ కాన్సెప్ట్‌తో కొత్త కొత్త ఫీచర్లతో ఈ కారును హోండా కంపెనీ రూపొందిస్తోంది. మొబిలో కారును బ్రియో ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నామని, ఇది చౌకధర మల్టీపర్పస్ వెహికల్ అని హోండా అంటోంది. ఇక డస్టర్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్‌యూవీ) అమ్మకాలు దుమ్ము రేపుతుండటంతో రెనో కంపెనీ ఈ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను తెస్తోంది. బీఎండబ్ల్యూ 1 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సీఎల్‌ఏ కార్లకు గట్టి పోటీనిచ్చేలా ఆడి ఏ3 కారును ఆడి కంపెనీ అందించనున్నది. ఈ కార్లను స్థానికంగానే ఆడి తయారు చేస్తోంది.