
దేవుడా.. ఎంత పని చేశావయ్యా!
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ఎంత పని చేశావయ్యా ? మేమేం పాపం చేశామయ్యా తండ్రీ ? ఎవరి కోసం బతకాలి నాయనా ? మాకు ఇంక దిక్కెవరు తండ్రీ అంటూ మృతుల తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గురువారం రాత్రి కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి చెందిన రాయంపల్లి హరిజన తిప్పేస్వామి, శాంతమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మహేంద్ర (22) ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. చెల్లెలు భవానికి కర్ణాటకలోని రాంపురం వద్ద గల బసాపురం గ్రామానికి చెందిన దురుగేష్‌తో వివాహమైంది. చెల్లిని పలకరిద్దామని గురువారం గ్రామానికి చెందిన చింతమాను తిప్పేస్వామి, శంకుతుల దంపతుల కుమారుడు మల్లికార్జున(20)ను వెంటబెట్టుకుని మహేంద్ర ద్విచక్రవాహనంపై బసాపురం వెళ్లాడు. చెల్లెలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం తిరుగుపయనమయ్యాడు. రాంపురం హైవే వద్దకు రాగానే వీరి బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహేంద్ర, మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాపు
మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సతీమణీ కాపు భారతి శుక్రవారం 74 ఉడేగోళం గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. మీ కుటుంబాలకు అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. కాపు వెంట వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మాధవరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కలుగోడు మహేష్, ఐనాపురం మంజునాథ, పవన్, రఘు, గోవిందప్ప, ఉలిగప్ప, రాజన్న, మల్లికార్జున తదితరులు ఉన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక్కొక్క కుటుంబానికి చంద్రన్న బీమా పథకం కింద రూ.5వేల తక్షణ సాయం అందజేసినట్లు వెలుగు ఏపీఎం తిప్పేస్వామి తెలిపారు.