ఫెడ్ ఎఫెక్ట్.. 2 వారాల కనిష్టం | US interest rate hike fears drag sensex 93 points down | Sakshi
Sakshi News home page

ఫెడ్ ఎఫెక్ట్.. 2 వారాల కనిష్టం

Published Fri, Mar 21 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

ఫెడ్ ఎఫెక్ట్.. 2 వారాల కనిష్టం

ఫెడ్ ఎఫెక్ట్.. 2 వారాల కనిష్టం

అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లు పెంచే సంకేతాలివ్వడంతో గురువారం ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ సూచీలు క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 93 పాయింట్ల క్షీణతతో రెండు వారాల కనిష్టస్థాయి 21,740 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41 పాయింట్ల తగ్గుదలతో 6483 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఉద్దీపన ప్యాకేజీ ముగిసిన తర్వాత 6 నెలలకు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయని ఫెడ్ ఛైర్మన్ జనెత్ యెలెన్ ప్రకటించడంతో గత రాత్రి అమెరికా సూచీలు 0.75 శాతం తగ్గాయి. దాంతో గురువారం ఆసియా సూచీలు కూడా క్షీణించాయి.

 అమెరికాలో రేట్ల పెంపు సంకేతాలతో విదేశీ ఇన్వెస్టర్లు కొంతమేర పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవచ్చన్న అంచనాలను మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దేశీ మార్కెట్లో రియల్టీ, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లు క్షీణించాయి. డీఎల్‌ఎఫ్ 3.5 శాతం తగ్గగా, హెచ్‌డీఎఫ్‌సీ, బీహెచ్‌ఈఎల్, ఎల్ అండ్ టీలు 2-3 శాతం మధ్య పడిపోయాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐలు 1-2 శాతం మధ్య తగ్గాయి. రూపాయి మారకపు విలువ తగ్గిన ప్రభావంతో ఐటీ షేర్లు పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసీస్, విప్రోలు 1-3 శాతం మధ్య ఎగిసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 722 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలుచేయగా, దేశీయ సంస్థలు రూ. 563 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.

 నిఫ్టీ 6,500 స్థాయిపై గురి...
 మరో ఐదు ట్రేడింగ్ సెషన్లలో మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న సందర్భంగానే ఫెడ్ నిర్ణయం వెలువడటంతో 6,500 స్థాయి మీద అటు బుల్స్, ఇటు బేర్స్ గురిపెట్టారు. వీరి పోరును సూచిస్తూ ఈ స్ట్రయిక్ వద్ద భారీగా కాల్, పుట్ రైటింగ్ జరిగింది. కాల్ ఆప్షన్లో 10.24 లక్షల షేర్లు, పుట్ ఆప్షన్లో 5.51 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. రెండింటిలోనూ మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) సమంగా 56 లక్షల షేర్ల చొప్పున వుంది. నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి లాంగ్ ఆఫ్‌లోడింగ్ జరగడంతో 6.64 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 1.92 కోట్ల షేర్లకు తగ్గింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 24 పాయింట్ల నుంచి 19 పాయింట్లకు తగ్గింది. సమీప భవిష్యత్తులో 6,500 దిగువన నిఫ్టీ క్రమేపీ 6,400 స్థాయికి తగ్గవచ్చని, 6,500పైన స్థిరపడితేనే తిరిగి మార్కెట్ బలపడే అవకాశాలుంటాయని ఈ డేటా సూచిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement