ప్రేమికుల రోజున టెల్కోల ‘ప్రేమగీతాలు’!
న్యూఢిల్లీ: సాధారణంగా మిగతా రోజుల్లో ఒకదానితో మరొకటి హోరాహోరీగా పోటీపడే టెలికం కంపెనీలు .. వాలంటైన్స్ డే నాడు మాత్రం వైరాన్ని కాస్త పక్కన పెట్టి పరస్పరం ప్రేమ సందేశాలు ఇచ్చి పుచ్చుకున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్వీటర్ ఇందుకు వేదికగా నిల్చింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాసెల్యులార్‌కు కొత్తగా అరంగేట్రం చేసిన రిలయన్స్ జియో ’హ్యాపీ వేలంటైన్స్ డే– విత్‌లవ్‌ఫ్రంజియో’ అంటూ ట్వీట్ చేయడంతో ఇది మొదలైంది. జియో ట్వీట్ ఆరు గంటల వ్యవధిలో 3 వేల సార్లు పైగా రీట్వీట్ అవడంతో పాటు 4 వేల పైచిలుకు లైక్‌లు దక్కించుకుంది. ఎయిర్‌టెల్ కూడా వెంటనే స్పందించింది. ’సేమ్ ఫీల్స్ రిలయన్స్ జియో.. ’ప్రతి ఫ్రెండు అవసరమేగా (ఎయిర్‌టెల్ స్లోగన్)’ అంటూ వొడాఫోన్, ఐడియాసెల్యులార్‌లను కూడా ప్రస్తావిస్తూ బదులి చ్చింది.
దీంతో ఐడియా సైతం రంగంలోకి దిగింది. రిలయన్స్‌జియోకి శుభాకాంక్షలు తెలియజేస్తూనే.. ఇవాళ రోజంతా ప్రేమమయం కావడం సంతోషకరమంటూ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లను ఉటంకిస్తూ పేర్కొంది. దీనిపై స్పందించిన ఎయిర్‌సెల్ తన వంతుగా ఐడియాకు ట్వీట్లు పంపింది. ’చిన్నదే అయినప్పటికీ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో ఎవరో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చారు .. సర్‌జీ’ అంటూ బిగ్గెస్ట్ స్మాల్ చేంజ్, సర్‌జీ అనే ఐడియా స్లోగన్స్‌ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. దీనికి ఐడియా కూడా హుందాగా స్పందించింది. వంద కోట్ల భారతీయులపై ప్రేమతో మనం కలిసి మరికాస్త ఎక్స్‌ట్రా ప్రయోజనాలు అందించేందుకు ప్రయత్నించాం అంటూ పేర్కొంది. (కుచ్ ఎక్స్‌ట్రా మిల్తా హైతో అచ్ఛా లగ్‌తా హై (ఏదైనా మరికొంచెం ఎక్కువ లభిస్తే సంతోషమే కదా!) అనేది ఎయిర్‌సెల్ స్లోగన్). ఇలా శుభాకాంక్షలు అందించుకోవడంలో కూడా ఆయా సంస్థలు తమ తమ ట్యాగ్‌లైన్స్‌ని ఉపయోగించుకోవడం ఈ ట్వీట్స్‌లో ప్రత్యేకత.