మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయండి..
ఇంటర్‌పోల్‌ను కోరిన ఈడీ
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీస్(ఆర్‌సీఎన్)ను జారీ చేయాల్సిన బాధ్యత ఇంటర్‌పోల్‌కు ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) పేర్కొంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ఆర్‌సీఎన్‌ను జారీ చేయడానికి అన్ని చట్టపరమైన పద్ధతులను అనుసరించామని ఇంటర్‌పోల్‌కు ఈడీ సవివరమైన సమాచారాన్ని అందించింది. విజయ్ మాల్యాకు ప్రొక్లెయిమ్‌డ్ ఆఫెండర్ స్టేటస్‌ను ఇవ్వాలని ముంబై కోర్టును కోరామని, ఈ విషయమై నేడు(సోమవారం) నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఇంటర్‌పోల్‌కు ఈడీ సమాచారమిచ్చింది.
ఐడీబీఐకు సం బంధించిన రూ.900 కోట్ల రుణ మోసం కేసులో విజయ్ మాల్యా, ఆయన కంపెనీల్లో ఒకదానికి చెందిన రూ.1,411 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు శనివారం అటాచ్ చేసిన విషయం తెలిసిందే.