జనం ముందుకు విజయ్ మాల్యా!
లండన్: భారత బ్యాంకులకు దాదాపు రూ.9 వేలకోట్లు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చాలా రోజుల తర్వాత అధికారిక సమావేశంలో కనిపించనున్నారు. గత మార్చి నెలలో యూకేకు పారిపోయిన తర్వాత మాల్యా అధికారిక ఈవెంట్లలో కనిపించలేదు. ప్రస్తుతం యూకేలోని లండన్లో నివాసం ఉంటున్న మాల్యా శుక్రవారం జరగనున్న బ్రిటీష్ గ్రాండ్ ప్రీ కన్నా కొంత సమయం ముందు ఇతర జట్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఫోర్స్ ఇండియాకు యజమాని అయిన మాల్యా.. ఫెరారీ, మెక్ లారెన్, మెనార్, విలియమ్స్, మెర్సిడేజ్ ఎఫ్1 రేస్ డైరెక్టర్లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా మాల్యా చిక్కుల్లో ఉన్నప్పటికీ, ఫోర్స్ ఇండియా మాత్రం సీజన్లో మంచి ఫలితాలను రాబట్టింది.
కాగా గత నెల లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుడిగా ముంబై కోర్టు ప్రకటించించిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకానందున, ఈడీ ఆస్తులను జప్తు చేయకముందే వాటిని అమ్మకాలు చేపట్టినందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధిష్టానం ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో జులై 29న ఉదయం 11 గంటల లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది.