డొల్ల కంపెనీలతో గుల్ల | Vijay Mallya's ghost companies | Sakshi
Sakshi News home page

డొల్ల కంపెనీలతో గుల్ల

Oct 24 2017 11:48 AM | Updated on Apr 6 2019 9:07 PM

Vijay Mallya's ghost companies - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కలకత్తా 700027...మింటో పార్క్‌...ఫార్మా ట్రేడింగ్‌ -2...ఈ పేర్లు మూవీ టైటిళ్లో, హిట్‌ కొట్టిన సినిమాల సీక్వెల్సో కాదు. అడ్డగోలు దోపిడీకి మాల్యా సృష్టించిన అడ్డాలు. బ్యాంకులకు వేల కోట్లు టోకరా వేసి బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా విన్యాసాలు దర్యాప్తు సంస్థలనే నివ్వెరపరుస్తున్నాయి. రహస్య లావాదేవీలు, మనీల్యాండరింగ్‌ కోసం మాల్యా ఏకంగా 20కి పైగా షెల్‌ కంపెనీలను సృష్టించాడని ఈడీ విచారణలో నిగ్గుతేలింది. మాల్యా తెరిచిన 20 డొల్ల కంపెనీల వ్యవహారాన్నిఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో పొందుపరించింది. ఈ ఉత్తు‍త్తి కంపెనీల్లో ఫార్మా ట్రేడింగ్‌ కంపెనీ, మింటో పార్క్‌, కల్‌కత్తా 700027 వంటి సంస్థలున్నాయి. ఇవన్నీ కాగితాలకే పరిమితమైన కంపెనీలు కాగా, వీటిని అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీల్యాండరింగ్‌ కార్యకలాపాలకు మాల్యా ఉపయోగించుకున్నట్టు ఈడీ భావిస్తోంది. ఈ కంపెనీలకు కనీసం కార్యాలయాలూ లేకపోవడం గమనార్హం. నమోదిత కార్యాలయాల వద్ద ఆరా తీసిన అధికారులకు ఆ పేర్లతో ఆఫీసులే లేవని సెక్యూరిటీ గార్డులు చెపుతుండటంతో దర్యాప్తు అధికారులు విస్తుపోయారు.

బ్యాంకుల నుంచి దండుకున్న రుణాలను ఈ కంపెనీల ద్వారా మాల్యా దారిమళ్లించారనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. మాల్యా ప్రారంభించిన 20 డొల్ల కంపెనీల్లో ఒకటైన ఫార్మా ట్రేడింగ్‌ కంపెనీ రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రికార్డుల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థ ఎలాంటి బిజినెస్‌ కార్యకలాపాలు చేపట్టడం లేదు. కనీసం కార్యాలయం, సిబ్బంది కూడా లేరని ఈడీ గుర్తించింది. మాల్యా సృష్టించిన కంపెనీల్లో డజను వరకూ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,సింగపూర్‌, మారిషస్‌లోనూ ఉన్నాయి.

అనుమానిత కంపెనీల డైరెక్టర్‌లను ఈడీ ప్రశ్నించి వివరాలు రాబడుతోంది. డొల్ల కంపెనీల్లో చాలా వరకూ మాల్యా తల్లి, కుమారుడు సిద్ధార్థ మాల్యా డైరెక్టర్లుగా ఉండగా, మరికొన్ని కంపెనీల్లో యూబీ గ్రూపులో మాల్యా సహచరులూ డైరెక్టర్లుగా ఉన్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. కోల్‌కతా కేంద్రంగా పలు నకిలీ కంపెనీలను మాల్యా ప్రారంభించారు. తమ కంపెనీకి చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్ల ద్వారా మాల్యా ఈ తతంగం నడిపారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ షెల్‌ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున నిధులను మాల్యా ఇతర దేశాలకు తరలించారని భావిస్తున్నాయి.

షెల్‌ కంపెనీలకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించిన ఈడీ బ్రిటన్‌ కోర్టుకూ ఈ వివరాలను నివేదించనున్నాయి. మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న పిటిషన్‌పై విచారణ జరుపుతున్నబ్రిటన్‌ కోర్టు డిసెంబర్‌లోగా మాల్యా అప్పగింతపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.డిసెంబర్‌ 4న మాల్యా అప్పగింత పిటిషన్‌పై బ్రిటన్‌ కోర్టు తుది విచారణ చేపట్టనుంది. ఈ లోగా విడివిడిగా దర్యాప్తు జరుపుతున్న సీబీఐ, ఈడీలు న్యాయస్ధానం ఎదుట సంయుక్త చార్జిషీట్‌ను సమర్పించవచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement