
బ్యాంక్ ఆఫ్ బరోడాకు మన్మోహన్ సింగ్ నోటీసు
విజయ్ మాల్యాకు గ్యారంటర్‌గా ఉన్నానంటూ తన ఖాతాలను ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడాపై పిలిభిత్‌కు చెందిన రైతు మన్మోహన్ సింగ్ పరువునష్టం దావా వేస్తున్నారు.
విజయ్ మాల్యాకు గ్యారంటర్‌గా ఉన్నానంటూ తన ఖాతాలను ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడాపై పిలిభిత్‌కు చెందిన రైతు మన్మోహన్ సింగ్ పరువునష్టం దావా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముంబైలోని ప్రాంతీయ కార్యాలయానికి ఆయన ఒక లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగించినందుకు గాను 30 రోజుల్లోగా రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. ఖజురియా నవీరామ్ గ్రామానికి చెందిన మన్మోహన్ సింగ్ అనే రైతు విజయ్ మాల్యా తీసుకున్న రూ. 550 కోట్ల రుణానికి గ్యారంటర్‌గా ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ముంబై ప్రాంతీయ కార్యాలయం గత డిసెంబర్ నెలలో కనుగొంది. దాంతో సింగ్ సేవింగ్స్ ఖాతాతో పాటు అతడి పంట రుణానికి సంబంధించిన ఖాతాను కూడా ఫ్రీజ్ చేయించింది.
తనకు దాంతో ఏం సంబంధం లేదని.. తన ఖాతాలు పునరుద్ధరించాలని సింగ్ ఎన్నిసార్లు కోరినా, బ్యాంకు అధికారులు స్పందించలేదు. దీనివల్ల తన క్లయింటు విపరీతమైన ఒత్తిడికి లోనవడంతో పాటు ఆయన పరువుకు కూడా భంగం వాటిల్లిందని, అందువల్ల బ్యాంకు ఆయనకు పరువునష్టం కింద రూ. 10 లక్షల పరిహారంతో పాటు పంటరుణం రాకపోవడం వల్ల ఆయనకు కలిగిన నష్టం కింద మరో రూ. 24వేలు కూడా చెల్లించాలని సింగ్ తరఫు న్యాయవాది రామ్ పాల్ గంగ్వార్ తెలిపారు.
తనకు బ్యాంకు ఖాతా లేకపోవడంతో చెక్కులు డ్రా చేసుకోలేనని, అందువల్ల తన చెరుకుపంటను కూడా ప్రభుత్వ సంస్థలకు కాకుండా తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చిందని.. దాంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని మన్మోహన్ సింగ్ చెప్పారు. తనలాంటి చిన్న రైతుకు ఇది చాలా పెద్ద నష్టమేనని అన్నారు.