
విజయ్ మాల్యాకు మన్మోహన్ గ్యారంటీ!
వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఎగ్గొట్టి బ్రిటన్‌లో హాయిగా తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గ్యారంటీగా ఎవరున్నారో తెలుసా.. మన్మోహన్ సింగ్!!
వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఎగ్గొట్టి బ్రిటన్‌లో హాయిగా తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గ్యారంటీగా ఎవరున్నారో తెలుసా.. మన్మోహన్ సింగ్!! అవును.. మీరు చదివింది నిజమే. కానీ ఈ మన్మోహన్ సింగ్ మాత్రం మన మాజీ ప్రధానమంత్రి కాదు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఓ చిన్నకారు రైతు. విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి ఈ రైతు గ్యారంటర్‌గా ఉన్నట్లు గుర్తించిన బ్యాంకు.. ఈయన ఖాతాను ఫ్రీజ్ చేయించింది. ఇదేంటని అడిగితే, మాల్యా అప్పు తిరిగి చెల్లించేవరకు ఖాతా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఉండవని చెప్పారు. మన్మోహన్ సింగ్‌కు 8 ఎకరాల భూమి ఉంది. అతడికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు ఖాతాలున్నాయి. ఆ రెండింటినీ ఫ్రీజ్ చేయాలని ముంబై హెడ్ ఆఫీసు నుంచి స్థానిక బ్రాంచికి ఆదేశాలు వచ్చాయి.
ఇదెలా జరిగిందో తనకు తెలియదని, అసలు మాల్యా ఎవరో, ఆయన అప్పులేంటో కూడా తెలియదని, జీవితంలో ఎప్పుడూ ముంబై నగరం ముఖం చూడలేదని ఈ మన్మోహన్ వాపోయాడు. ఖాతాలు లేవు కాబట్టి కనీసం గ్యాస్ సబ్సిడీ కూడా అతడికి అందట్లేదు. కనీస మద్దతు ధర రావాలంటే బ్యాంకు ఖాతా ఉండాలని, అది లేదు కాబట్టి తన గోధుమ పంటను ప్రైవేటు వ్యాపారులకు కారుచవగ్గా అమ్మాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు వేయబోయే వరిపంటకు కూడా సబ్సిడీ వచ్చే అవకాశం ఏ కోశానా లేదు. ఇతర బ్యాంకులు కూడా అతడికి కొత్త ఖాతా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక మన్మోహన్ సింగ్ తల పట్టుకుని కూర్చున్నాడు.