
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా అప్పుల్లో అసలు భాగం మొత్తాన్ని తీర్చేసేందుకు సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని నూటికి నూరు శాతం చెల్లించేస్తానని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ‘ఈ అంశం ముఖ్యంగా ప్రజాధనంతో ముడిపడి ఉంది. (పెరిగిపోతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్) నష్టాలను తట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కుమ్మరించాల్సి వచ్చింది. అక్కడికీ రుణంలో అసలు భాగాన్ని 100 శాతం తిరిగి చెల్లించేస్తానని బ్యాంకులు, ప్రభుత్వానికి ఆఫర్ చేస్తున్నాను. దయచేసి తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి నిరాకరిస్తే.. ఎందుకు నిరాకరిస్తున్నారన్నదైనా తెలపాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పక్షాలు, మీడియా తనపై కావాలనే ‘డిఫాల్టర్’ అనే తప్పుడు ముద్ర వేశాయని మాల్యా ఆక్రోశం వ్యక్తం చేశారు.
‘ప్రభుత్వ రంగ బ్యాంకుల సొమ్ముతో పరారయ్యానని, డిఫాల్టర్ అని రాజకీయ పక్షాలు, మీడియా ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా అబద్ధం. రుణాల వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటానంటూ కర్ణాటక హైకోర్టుకు నేను సమర్పించిన సమగ్ర ఆఫర్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. ఇది బాధాకరం‘ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, బ్రిటన్ తనను భారత్‌కు అప్పగించే విషయంలో మీడియా ఏవేవో రాస్తోందని, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాల్యా తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ. 9,000 కోట్ల రుణాన్ని ఎగవేసిన మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు పరారైన సంగతి తెలిసిందే.