వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ ‘రోమింగ్’ బంధం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ప్రైవేటు రంగ వొడాఫోన్ మధ్య దేశవ్యాప్త 2జీ ఇంట్రా సర్కిల్ (ఒకే సర్కిల్ పరిధిలో) రోమింగ్ ఒప్పందం కుదిరింది. దీంతో కాల్స్ డ్రాప్స్ తగ్గి కస్టమర్లకు మెరుగైన సేవలు అందుతాయని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ టవర్లు అందుబాటులోకి రావడం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ కవరేజీ మెరుగుపడనుంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌తో వొడాఫోన్ 2జీ కవరేజీ పెంచుకోనుంది. అదనంగా టవర్ల అందుబాటుతో కాల్ డ్రాప్స్ సమస్య తగ్గుతుందని ఇరు కంపెనీలు ఆశిస్తున్నాయి.
వొడాఫోన్ ఇండియాకు 1.37 లక్షల మొబైల్ టవర్లు ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తమకు కవరేజీ పెరుగుతుందని వొడాఫోన్ ఇం డియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వొడాఫోన్‌తో భాగస్వామ్యం వల్ల బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ కవరేజీ, ముఖ్యంగా పట్టణాల్లో మెరుగుపడుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ శ్రీవాస్తవ తెలిపారు.