భారత్‌లో కోట్ల కొద్దీ లంచాలిచ్చిన వాల్‌మార్ట్
వాషింగ్టన్: రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో తమ వ్యాపార అవసరాల రీత్యా స్థానిక అధికారులకు భారీ ఎత్తున కోట్ల కొద్దీ లంచాలిచ్చి పనులు జరిపించుకుందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. రియల్ ఎస్టేట్ అనుమతులు, కస్టమ్స్ క్లియరెన్స్ మొదలైన వాటి కోసం కింది స్థాయి సిబ్బందికి స్వల్ప మొత్తాలు చెల్లించిందని పేర్కొంది. సందేహాస్పద చెల్లింపుల్లో చాలా మటుకు 200 డాలర్ల కన్నా(సుమారు రూ. 13,000) తక్కువే ఉన్నాయని, కొన్ని సందర్భాల్లో అత్యంత తక్కువగా 5 డాలర్ల(దాదాపు రూ. 350) చెల్లింపులు కూడా ఉన్నాయని పత్రిక తెలిపింది.
ఇవన్నీ కలిపితే మిలియన్ల కొద్దీ డాలర్లవుతాయని, దర్యాప్తు సంస్థలకు ఇందుకు సంబంధించి ఆధారాలు లభించాయని వివరించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆయా సంస్థలు ఆర్జించిన లాభాలను బట్టి పెనాల్టీ ఉంటుందని పేర్కొంది. అయితే, భారత్‌లో వాల్‌మార్ట్‌కి ఇప్పటిదాకా లాభాలేమీ రానందున కంపెనీపై జరిమానా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సమాచారం. లంచాల వ్యవహారంపైనే 2012లో సంస్థ సీఎఫ్‌వో సహా అయిదుగురిపై వేటు పడిన సంగతి తెలి సిందే. మరోవైపు, దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నామని వాల్‌మార్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్ చెప్పారు.
భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో జాయింట్ వెంచర్ ద్వారా 2007లో వాల్‌మార్ట్ భారత మార్కెట్‌లో ప్రవేశించింది. ఆ తర్వాత రిటైల్ స్టోర్స్ ఏర్పాటు యోచనను విరమించుకుని, హోల్‌సేలర్‌గానే కొనసాగాలని నిర్ణయించుకున్న వాల్‌మార్ట్.. 2013లో భాగస్వామ్యం నుంచి తప్పుకుంది. అయితే, మెక్సికో, చైనా, బ్రెజిల్ తదితర దేశాల్లోనూ అక్కడి అధికారులకు లంచాలిచ్చి పనులు జరిపించుకుందని వాల్‌మార్ట్‌పై అభియోగాలు వచ్చాయి.