న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్‌నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్‌టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది.
భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది.
ఐకియా సైతం...
మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తేవి.
కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్‌మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు.
భారత్‌లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్‌ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment