ఫండ్ ఎంచుకునే పద్ధతి ఏమిటి? | What is the choose method of the fund? | Sakshi
Sakshi News home page

ఫండ్ ఎంచుకునే పద్ధతి ఏమిటి?

Published Mon, May 12 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

What is the  choose method of the fund?

 మంచి ఫండ్‌ను ఎంచుకోవడానికి సరైన పద్ధతి ఏమిటి? ఈక్విటీ డైవర్సీఫైడ్ ఫండ్‌కంటే బ్యాలెన్స్‌డ్ ఫండ్ మెరుగైనదా?
 - విశాల్,  వైజాగ్

 మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపికచేసుకునేటపుడు ఆయా ఫండ్స్‌కు వున్న రేటింగ్స్ చూడటం ఉపయోగపడుతుంది. టాప్ రేటింగ్స్ వుండే ఫండ్స్‌లో మంచి పనితీరు కనపర్చినవాటిని...అవి గ్యారంటీ రాబడుల్ని ఆఫర్‌చేయకపోయినా మీరు విశ్వసించవచ్చు. మ్యూచువల్ ఫండ్ ధర, అవి ఆర్జించే రాబడులు రోజువారీగా మారిపోతుంటాయి.

అయితే వాటికి (ఫండ్స్‌కు) వాల్యూ రీసెర్చ్ ఇచ్చే ఫండ్ రేటింగ్స్‌ను నెలకోసారి సవరించడం జరుగుతుంది. రేటింగ్ మార్పులు మరీ ఎక్కువగా లేకుండా మా రేటింగ్ పద్ధతిని రూపొందించాం. ఇక మీ రెండో ప్రశ్నకొస్తే...ఈక్విటీ ఫండ్స్‌కంటే రుణపత్రాల్లో పెట్టుబడి దృష్ట్యా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మెరుగైన స్థిరత్వాన్ని ఇస్తాయి. మీరు భరించే రిస్క్‌నుబట్టి మీ ఎంపిక ఆధారపడివుంటుంది. ఒడుదుడుకుల్ని ఏమాత్రం భరించలేకపోతే ఎటువంటి మార్కెట్ ఆధారిత పెట్టుబడికైనా దూరంగా వుండండి.

 నా ఇద్దరు పిల్లలకోసం 10 సంవత్సరాలకుగాను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయదల్చాను. ఎక్కడ పెట్టుబడి చేయాలి?
 - శిరీష్,   కరీంనగర్

 మీ ఇద్దరు పిల్లల కోసం పెట్టుబడి చేసేటపుడు మీరు ఎటువంటి విభిన్న పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మంచి పనితీరు కనపర్చే ఓ రెండు ప్రధాన ఫండ్ స్కీములను ఎంచుకొని, వాటిలో సిప్ విధానంలో క్రమంగా పెట్టుబడి చేయండి. హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, యూటీఐ ఆపర్చూనిటీస్, బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్‌ల నుంచి మల్టీ-క్యాప్ విభాగంలోని కొన్ని స్కీముల్ని ఎంచుకోవొచ్చు. మార్కెట్లు ఎలావున్నా వీటిలో పెట్టుబడి చేయవచ్చు. కానీ ఏడాదికోసారి ఈ పెట్టుబడుల్ని సమీక్షించుకోవాలి.

 నెలకు ఎన్‌పీఎస్‌లో నెలకు రూ. 500, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 16,000, ఈపీఎఫ్‌లో రూ. 8,000 చొప్పున పెట్టుబడి చేస్తున్నా. అయితే నాకు పీపీఎఫ్ అకౌంట్ లేదు. నా రిటైర్‌మెంట్ కోసం పీపీఎఫ్ ఖాతా కావాలనుకుంటున్నాను. 15 సంవత్సరాల్లో అది పరిపక్వం కావాలంటే నేను ఇప్పుడే ఆ ఖాతాను ప్రారంభించాల్సివుంటుందా? ప్రతీ నెలా నేను ఎంత పెట్టుబడి చేయాల్సివుంటుంది?
 - సురేష్. ఈ మెయిల్

 పదవీ విరమణ తర్వాత స్థిరాదాయం, తక్షణాదాయ అవసరాల కోసం మీకు వివిధ మార్గాలు అవసరమవుతాయి. ఉదాహరణకు ఈపీఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ స్థిరాదాయం. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే ఆదాయం అలాంటిది కాదు. రిటైర్‌మెంట్ తర్వాత ఆదాయం కోసం చూసేటపుడు ద్రవ్యోల్బణ ప్రభావం, మీకు ప్రతీ నెలా కచ్చితంగా కావాల్సిన మొత్తం వంటివి పరిగణనలోకి తీసుకోండి. ఉదాహరణకు ప్రస్తుతం మీరు ఏదైనా కొనడానికి రూ. 10 ఖర్చుచేస్తుంటే , ప్రతీ ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ప్రకారం అది పదేళ్ల తర్వాత రూ. 18 ధరకు పెరుగుతుంది.

అందువల్ల మీ ప్రస్తుత పెట్టుబడి మీ రిటైర్‌మెంట్ అవసరాలకు తగినంతగా లేకపోతే ఇందుకోసం మీరు పొదుపును, పెట్టుబడుల్ని పెంచాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో మీరు పెట్టుబడిని 15 సంవత్సరాలు అట్టిపెట్టగలిగితే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) అనువైనది. మీ రిటైర్ అయ్యే సమయం తక్కువగావుంటే పదవీ విరమణ కోసం పెట్టుబడుల్ని పెంచుకోండి.

 నేను 10 శాతం టాక్స్ బ్రాకెట్‌లోకి వస్తాను. నేడు ఇండక్సేషన్ ప్రయోజనం కోసం ప్రయత్నించవచ్చా? - వినీల్,  తిరుపతి
 మీకు వచ్చే ప్రయోజనం ఆధారంగానే మీరు వ్యవహరించాలి తప్ప, మీరు ఏ టాక్స్ బ్రాకెట్‌లో వున్నారన్నది ప్రధానం కాదు. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్‌లో చేస్తే, మీరు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌గా 10 శాతంగానీ, ఇండెక్సేషన్‌తో 20 శాతంగానీ చెల్లించవచ్చు. లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ అసెట్ అయినప్పటికీ, ఇండెక్సేషన్‌తో 20 శాతం చెల్లించినా, పన్ను తక్కువగానే వుంటుందిగనుక ఈ ఆప్షన్‌ను ఎంచుకోండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement