దేశంలో ఆన్‌లైన్ కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మధ్య డీల్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. సుమారు ఆరు నెలల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను(80శాతం) వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో అమెజాన్ లాంటి గట్టి ప్రత్యర్థులకు ఎదురు దెబ్బేనని అంచనాలు కూడా భారీగానే వచ్చాయి. అయితే ఇంతలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తనవాటా మొత్తాన్ని అమ్ముకొని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్ రాజీనామా చేసి వెళ్లిపోవడం ఊహించని పరిణామం. కానీ మరో ఫౌండర బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా కొనసాగారు. ఇది ఇలా ఉండగానే మరో కీలక పరిణామం చోటు చేసుసుకుంది. తీవ్రమైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ పదవినుంచి వైదొలిగారు. వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు, స్వతంత్ర దర్యాప్తు అనంతరం ఆయన రాజీనామాను ఆమోదించామని వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ అనూహ్య పరిణామం నుంచి ఇంకా తేరుకోక ముందే అదే సంస్థలో భాగమైన మింత్ర సీఈఓ అనంత నారాయణన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) దీపంజన్ బసు తమ రాజీనామా సమర్పించారన్న వార్తలు కార్పొరేట్ ప్రపంచాన్ని విస్మయ పరిచాయి.
బిన్సీ బన్సల్ సంస్థను వీడిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ గ్రూపునకు కళ్యాణ్ కృష్ణమూర్తి సీఈవోగా ఎంపికయ్యారు. అయితే ఇంతలోనే బిన్సీకి సన్నహితుడైన అనంత నారాయణన్ కూడా రిజైన్ చేశారనీ, ఈ మేరకు ఆయన రాజీనామాను కొత్త సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తికి పంపించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలను అనంత్ నారాయణన్ ఖండించారు. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూనిట్లు మింత్రా-జబాంగ్‌లకు చీఫ్‌గా కొనసాగుతానని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని నారాయణన్ కొట్టి పారేశారు.
ఉద్యోగాల కోత
వాల్‌మార్ట్ డీల్ అనంతరం సంస్థ పునరుద్ధరణ, ఇతర ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా గుర్గావ్‌లోని జబాంగ్‌లో 40-50శాతం ఉద్యోగులపై వేటు వేయనుంది. దాదాపు 2వందలనుంచి 250మంది దాకా ఉద్యోగులను తొలగించనుంది. మింత్రా-జబాంగ్ సంయుక్తంగా బెంగళూరు నుంచి కార్యకలాపాలను నిర్వహించనున్న నేపథ్యంలో బెంగళూరుకు షిప్ట్ కావడానికి ఇష్టపడని ఉద్యోగులను కూడా మూడు నెలల జీతం, గ్రాట్యుయిటీ, ప్రతీ ఏడాదీ 15రోజుల జీతం చెల్లించి మరీ ఇంటికి పంపిస్తోందట. బిన్సీ రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే ఈ పరిణామం.
గ్రూపు సీఈవో పదవి రద్దు
బన్సల్ రాజీనామా తరువాత అసలు గ్రూప్ సీఈవో పదవినే రద్దు చేసి కొత్త నిర్మాణ వ్యవస్థపై వాల్‌మార్ట్ నియంత్రణలోని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
టాప్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా?
ఇది ఇలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత సమస్యలు ముదురుతున్నాయనీ, దీంతో టాప్ గ్జిక్యూటివ్‌లు రాజీనామా బాట పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మింత్రా సీఈఓ, సీఎఫ్‌ఓ కంపెనీకి గుడ్‌బై చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడాయి. ఫ్లిప్‌కార్ట్‌లో భాగమైన జబాంగ్ సీఈఓ గుంజన్ సోనీ కూడా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటూ కంపెనీ స్ట్రాటజీ అండ్ కేటగిరీ బిజినెస్ హెడ్ అనన్య త్రిపాఠీ కూడా కంపెనీకి గుడ్ బై చెప్పడంతో అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులంతా రాజీనామా బాట పడుతోంటే ఫిప్‌కార్ట్ పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశమైంది. అలాగే స్వతంత్ర విచారణలో బిన్సీ తప్పు నిరూపితం కాలేదని ప్రకటించిన వాల్‌మార్ట్, అతని రాజీనామాను ఎందుకు ఆమోదించింది అనేది అనేక అనుమానాలను రేకెత్తించింది. అయితే వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కొత్త నియామకం
ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కీలక నియామకాన్ని చేపట్టింది. దాదాపు 18నెలలుగా ఖాళీగా ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ను భర్తీ చేసింది. ఫ్లిప్‌కార్ట్ చీఫ హెచ్‌ఆర్‌గా సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్‌లో పనిచేసిన స్మృతిసింగ్‌ను నియమించినట్టు తెలుస్తోంది. డిసెంబరు నుంచి స్మృతి సింగ్‌బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను కూడా ప్రస్తుత సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తే నిర్వర్తించారు.
కాగా జబాంగ్ కాంట్రిబ్యూషన్ లేని కారణంగా2018 సంవత్సరానికి సంబంధించి మింత్ర ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. దీంతో ఇకపై స్వతంత్రగా వ్యవహరించాలని మింత్రా భావిస్తోందట. దీనిపై కూడా త్వరలోనే ఒక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. 2016, జులైలో జబాంగ్ మింత్రాలో విలీనమైంది. ఈ ఊహాగానాలపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment