మళ్లీ ధరాభారం!
జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతం
► ఐదు నెలల గరిష్ట స్థాయి
► ఇక ఇదే నెల్లో రిటైల్ ధరల పెరుగుదల స్పీడ్ 2.36%
► కూరగాయల ధరలు రయ్...
► జీఎస్‌టీ అమలు ప్రారంభ నేపథ్యం...
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత అంచనాల పరిధిలోనే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం జూలై గణాంకాలు కొంత ఆందోళనకు కారణమయ్యాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువబాట పట్టాయి. టోకు ద్రవ్యోల్బణం జూలైలో 1.88 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 జూలైతో పోల్చితే 2017 జూలైలో టోకున ఉత్పత్తుల బాస్కెట్ ధర 1.88 శాతం పెరిగిందన్నమాట.
గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. 2017 జూన్‌లో ఈ రేటు 0.90 శాతం కాగా, 2016 జూలైలో ద్రవ్యోల్బణం రేటు 0.63 శాతం. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల స్పీడ్ కూడా ఈ ఏడాది జూన్‌లో 1.46 శాతం ఉంటే, జూలైలో ఇది 2.36 శాతానికి ఎగసింది. ప్రత్యేకించి కూరగాయల ధరలు పెరిగాయి. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండాలని ఆర్‌బీఐ నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. టోకు సూచీని విభాగాల వారీగా వార్షిక రీతిన పరిశీలిస్తే...
టోకున ‘ఫుడ్’ ఓకే...!
♦ ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం వార్షికంగా 6.03 శాతం నుంచి 0.46 శాతానికి తగ్గింది. ఇక్కడ ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరల పెరుగుదల స్పీడ్ 8 శాతం నుంచి 2.15 శాతానికి తగ్గితే, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణ రేటు 8.96 శాతం నుంచి ఏకంగా –6.32 క్షీణతలోకి జారింది.
♦
ఇంధనం, విద్యుత్: వార్షికంగా చూస్తే ఈ విభాగం –9.70 శాతం క్షీణ రేటు నుంచి 4.37 శాతం పెరుగుదలకు మారింది. ఈ ఏడాది జూన్ నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 5.28 శాతం.
♦ మొత్తం సూచీలో దాదాపు 60% వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం రేటు 0.36 శాతం నుంచి 2.18 శాతానికి పెరిగింది. 2017 జూన్‌లో ఈ రేటు కొంచెం ఎక్కువగా 2.27 శాతంగా ఉంది.
కూరగాయల ధరలు పైకి...
వార్షికంగా మొత్తం ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధరల స్పీడ్ తగ్గినట్లు కనిపించినప్పటికీ, కొన్ని నిత్యావసరాల ఉత్పత్తుల ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. 2017 మే, జూన్ నెలల్లో కూరగాయల ధరల బాస్కెట్ ధరల్లో (2016 మే, జూన్ నెలల ధరలతో పోల్చి) క్షీణత కనిపించింది.
అయితే 2017 జూలైలో మాత్రం కూరగాయల ధరల స్పీడ్ భారీగా పెరిగింది. జూన్‌లో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా – 21.16 శాతం క్షీణిస్తే, జూలైలో ఈ రేటు భారీగా 21.95 శాతం ఎగిసింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు 3.30 శాతం పెరిగితే, పండ్ల ధరలు 2.71 శాతం, తృణధాన్యాల ధరలు 0.63 శాతం, ధాన్యం ధర 3.47 శాతం ఎగిశాయి. చక్కెర ధర 8.44 శాతం పెరిగింది. కాగా బంగాళదుంపల ధరలు 42.45 శాతం తగ్గాయి. పప్పుల ధరలు 32.56 శాతం దిగివచ్చాయి.
రిటైల్‌గా చూస్తే...
జూలైలో చక్కెర, తీపి పదార్థాల ఉత్పత్తులు (8.27 శాతం), పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల (6.39 శాతం) ధరలు పెరిగాయి. ఆహార ధరల ద్రవ్యోల్బణం క్షీణతలోనే ఉన్నప్పటికీ, ఇది –2.12 శాతం (జూన్) నుంచి –0.29 శాతానికి (జూలై) చేరింది. హౌసింగ్ వ్యయాలు 4.98 శాతం ఎగిశాయి. ఫ్యూయల్, లైట్ విభాగంలో పెరుగుదల రేటు 4.86 శాతంగా ఉంది. దుస్తులు, పాదరక్షల ధరలు 4.22 శాతం ఎగిశాయి. ఇక పప్పు దినుసుల ధరలు –24.75 శాతం తగ్గాయి. ఇక వేర్వేరుగా చూస్తే... గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు 1.52 శాతం నుంచి 2.41 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో రేటు 1.41 శాతం నుంచి 2.17 శాతానికి ఎగిసింది.