ముడి చమురు పతనంతో నష్టాలు
286 పాయింట్ల నష్టంతో 24,539కు సెన్సెక్స్
ముడి చమురు ధరలు తాజాగా పతనం చెందడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. కీలక రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్‌బీఐ, బడ్జెట్‌లో ప్రకటించే సంస్కరణలపై ఆధారపడి తదుపరి రేట్ల కోత ఉంటుందంటూ ప్రకటించడం, రూపాయి 14 పైసలు పతనమై 67.98కు చేరడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 24,539 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 7,456 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్, గ్యాస్, లోహ, వాహన, బ్యాంక్, ఫార్మా, విద్యుత్ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది.
అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు రిస్క్ అధికంగా ఉంటున్న ఆయిల్, ఈక్విటీలు, కమోడిటీలను అమ్మేస్తున్నారని నిపుణుల అంచనా. సెన్సెక్స్ 24,868 పాయింట్ల వద్ద లాభాల్లోనే మొదలైంది. ప్రారంభ కొనుగోళ్లతో 24,929 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. 24,461 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ 468 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
క్విక్ హీల్ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.311-321
సాఫ్ట్‌వేర్ సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ తన ఐపీఓకు రూ.311-321ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఈ నెల 8న ప్రారంభమై, 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించాలని క్విక్ హీల్ టెక్నాలజీస్ యోచిస్తోంది.