పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని, వారి భవిష్యత్తు భద్రంగా ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. చదువు, ఇతర ముఖ్య అంశాల్లో వారికెలాంటి ఒడిదుడుకులూ ఎదురవకూడదని ఆశిస్తారు. అయితే దీనికి చేయాల్సిందొకటే. ఎవరి ఆదాయ వనరులు ఎంతో వారికి దాదాపు తెలుసు కనుక పిల్లల కోసం పక్కా ప్రణాళిక వేసుకోవాలి. ఎందుకంటే చదువులకయ్యే ఖర్చు ఏటేటా పెరుగుతుంటుంది. వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సొమ్మును ఇన్వెస్ట్ చేయాలి. పెరిగే విద్యా వ్యయాన్ని తట్టుకునే శక్తి ఈ పెట్టుబడుల ద్వారా సమకూరుతుంది. పిల్లల కోసం చక్కని బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి తగిన స్కీమును వారు ఎంచుకుంటే పిల్లల భవితకు ఢోకా ఉండదు. దురదృష్టవశాత్తూ తల్లిదండ్రులు మరణించినా వారి చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. బాలలకు తగిన బీమా పథకాన్ని ఎంచుకోవడానికి నాలుగు సులభ సూత్రాలివీ...
1. పిల్లలకు 18 ఏళ్లు రాగానే మెచ్యూరిటీ ఫలితాలు ప్రారంభమయ్యే విధంగా అనేక కంపెనీల స్కీములున్నాయి. ఆర్థిక సలహాదారుతో చర్చించి మీకు తగిన ప్లాన్‌ను ఎంచుకోండి.
2. పలు కంపెనీల ప్లాన్లలో ప్రీమియం మాఫీ ఆప్షన్ ఉంటుంది. పేరెంట్ చనిపోతే ఇక ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ మాత్రం మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది.
3. పెట్టుబడికి రక్షణతో పాటు అధిక ఆదాయాన్నిచ్చే విధంగా బీమా పథకం ఉండాలి. వార్షిక ప్రీమియంకు కనీసం 20 రెట్లు రిస్క్ కవరేజీ ఉండేట్లు చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ పేరెంట్ మరణిస్తే రిస్క్ కవరేజీ కారణంగా ఆ కుటుంబానికి గణనీయ మొత్తం అందుతుంది.
4. బీమా ప్రొడక్టుకు సంబంధించిన బ్రోచర్‌ను క్షుణ్ణంగా చదవండి. ఖాతాదారులు ఎంత చెల్లించాలో ఆ బ్రోచర్లో స్పష్టంగా ఉంటుంది. మార్కెట్లో లభించే ప్రొడక్టు(స్కీము)లను, కంపెనీల ప్రతిష్టను, పథకాల్లో ఫ్లెక్సిబిలిటీని, సేవల్లో నాణ్యతను పోల్చిచూడండి. మీకు నచ్చిన పథకాన్ని తీసుకోండి.
- మయాంక్ బత్వాల్,
డిప్యుటీ సీఈవో, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్
51 శాఖలు ప్రారంభించిన ఎస్‌బీఐ ఫండ్
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా రికార్డు స్థాయిలో 51 శాఖలను ఒకే రోజున ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలు విస్తరించేందుకు ఇది ఉపకరించగలదని ఎస్‌బీఐ ఎంఎఫ్ ఎండీ దినేష్ ఖరా తెలిపారు. దీంతో మొత్తం శాఖల సంఖ్య 161కి చేరుకున్నట్లు ఆయన వివరించారు.
ప్రిన్సిపల్ మ్యూచువల్ స్కీముల విలీనం
ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ తాజాగా తమ రిటైల్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌ను గ్రోత్ ఫండ్‌లో విలీనం చేయనున్నట్లు తెలిపింది. ఇది ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సుముఖంగా లేని యూనిట్ హోల్డర్లు.. నోటీసు వ్యవధిలో ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా వైదొలిగేందుకు ఫండ్ అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 28 సాయంత్రం 3 గంటల దాకా నోటీసు వ్యవధి ఉంటుంది.
యూటీఐ ఎంఎఫ్ నుంచి డెట్ ఫండ్
యూటీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. రాబడులపై నిర్దిష్ట హామీ ఉండని ఈ ఓపెన్ ఎండెడ్ స్కీము గడువు జనవరి 31తో ముగిసినా..ఫిబ్రవరి 6 నుంచి కొనుగోళ్లు, అమ్మకాల కోసం పునఃప్రారంభిస్తామని సంస్థ పేర్కొంది. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే డెట్ సాధనాల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా తక్కువ రిస్కు, అధిక లిక్విడిటీతో సముచిత రాబడులు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రాథమికంగా ట్రిపుల్ ఎ, ఎ1 ప్లస్ రేటింగ్ ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.