విప్రో ఫలితాలు.. ప్చ్..!
• క్యూ2లో లాభం రూ.2,070 కోట్లు.. 7.6 శాతం డౌన్
• 10.5 శాతం పెరిగిన ఆదాయం.. రూ.13,897 కోట్లు
• నిరుత్సాహపరిచిన క్యూ3 గెడైన్స్...
బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో... నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7.6 శాతం దిగజారి రూ.2,070 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 2,241 కోట్లుగా ఉంది. కాగా, ఒక్క ఐటీ సేవలకు సంబంధించి క్యూ2లో కంపెనీ 1.916 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే, ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ అంచనా(గెడైన్స్) వేసిన 1.931-1.950 బిలియన్ డాలర్లతో పోలిస్తే తగ్గడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం 10.5 శాతం పెరుగుదలతో రూ.13,897 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.12,567 కోట్లు.
సీక్వెన్షియల్‌గా ఇలా...
ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,052 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ2లో లాభం స్వల్పంగా 0.9 శాతమే పెరిగింది. కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.13,698 కోట్లతో పోలిస్తే 1.5 శాతం వృద్ధి చెందింది. ఇక ఐటీ సేవల ఆదాయం కూడా సీక్వెన్షియల్‌గా 0.2 శాతమే(రూ.13,136 కోట్లు) పెరిగింది. విశ్లేషకులు క్యూ2లో ఐటీ సేవలకు సంబంధించి ఆదాయం సీక్వెన్షియల్‌గా డాలర్లలో 0.4 శాతం, రూపాయిల్లో 1.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. కాగా, స్థిర కరెన్సీ ప్రాపతిపదికన ఆదాయాలు గెడైన్స్‌కు అనుగుణంగానే నమోదయ్యాయని కంపెనీ సీఈఓ అబిదాలి నీముచ్‌వాలా పేర్కొన్నారు.
గెడైన్స్ తగ్గింది...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయ అంచనా(గెడైన్స్)ను కూడా విప్రో తగ్గించింది. 1.916-1.955 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. ప్రధానంగా ఐటీ సేవలకు మిశ్రమ డిమాండ్ పరిస్థితులు, సీజనల్‌గా బలహీన క్వార్టర్(పనిదినాలు తక్కువగా ఉండటం కారణంగా) నేపథ్యంలో గెడైన్స్‌ను తగ్గించాల్సి వచ్చిందని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాాగా, పరిశ్రమ విశ్లేషకులు క్యూ3లో 1-3 శాతం ఆదాయ వృద్ధి ఉండొచ్చని అంచనా వేయగా.. విప్రో గెడైన్స్ 0-2 శాతానికే పరిమితం కావడం గమనార్హం.
ఇతర ముఖ్యాంశాలివీ...
⇔ ఐటీ ఉత్పత్తుల ఆదాయం క్యూ2లో రూ.544 కోట్ల నుంచి రూ.770 కోట్లకు ఎగబాకింది.
⇔ సెప్టెంబర్ చివరినాటికి ఐటీ సేవల విభాగం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,74,238కి చేరింది.
⇔ ఇక అమెరికా వ్యాపారం ఆదాయం క్యూ2లో 1.8 శాతం, యూరప్ ఆదాయం 0.3 శాతం చొప్పున సీక్వెన్షియల్‌గా వృద్ధి చెందింది.
⇔ కాగా, అమెరికా క్లౌడ్ సేవల కంపెనీ అపిరియోను 50 కోట్ల డాలర్ల(దాదాపు రూ.3,350 కోట్లు) మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు విప్రో గురువారం(20న) ప్రకటించిన సంగతి తెలిసిందే.
⇔ విప్రో షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 0.75% లాభంతో రూ.499 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను వెల్లడించింది.