విప్రో లాభం తగ్గింది.. | Wipro Q4 IT services revenue in line, sees Q1FY17 growth at 1-3% | Sakshi
Sakshi News home page

విప్రో లాభం తగ్గింది..

Published Thu, Apr 21 2016 12:19 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

విప్రో లాభం తగ్గింది.. - Sakshi

విప్రో లాభం తగ్గింది..

క్యూ4లో రూ. 2,235 కోట్లు;  1.6 శాతం తగ్గుదల
ఆదాయం 13 శాతం వృద్ధి; రూ.13,742 కోట్లు
షేరుకి రూ.1 చొప్పున తుది డివిడెండ్
బైబ్యాక్ షేరు ధర రూ.625గా నిర్ణయం

 బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో లాభాలు స్వల్పంగా తగ్గాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,235 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,272 కోట్లతో పోలిస్తే 1.6 శాతం తగ్గింది. అయితే, ఆదాయం మాత్రం 12.9 శాతం వృద్ధి చెంది రూ.12,171 కోట్ల నుంచి రూ.13,742 కోట్లకు ఎగబాకింది. విప్రో టర్నోవర్‌లో అత్యధికంగా నిలిచే కీలకమైన ఐటీ సేవల ఆదాయం రూ. 12,796 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఈ విభాగం ఆదాయం రూ.11,242 కోట్లతో పోలిస్తే 13.8 శాతం వృద్ధి నమోదైంది.

 సీక్వెన్షియల్‌గా ఇలా...
డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో లాభం రూ.2,234 కోట్లతో పోలిస్తే క్యూ4లో(సీక్వెన్షియల్‌గా) దాదాపు అదే స్థాయిలో నమోదైంది. ఆదాయం మాత్రం 6.1 శాతం వృద్ధి చెందింది. ఇక ఐటీ సేవల ఆదాయం సీక్వెన్షియల్‌గా రూ.12,315 కోట్ల నుంచి 3.9 శాతం పెరిగింది. ఇటీవల కంపెనీ జరిపిన విదేశీ కొనుగోళ్లు ఐటీ సేవల ఆదాయం పెరిగేందుకు ప్రధానంగా దోహదం చేశాయి. జర్మనీకి చెందిన ఐటీ కన్సల్టింగ్ సంస్థ సెలెంట్ ఏజీ, అమెరికా కంపెనీ హెచ్‌పీహెచ్ హోల్డింగ్స్ కార్ప్, విటియోస్ గ్రూప్‌లను విప్రో గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, డాలర్ల రూపంలో(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) చూస్తే ఐటీ సేవల ఆదాయం సీక్వెన్షియల్‌గా 2.4 శాతం పెరిగి 188.76 కోట్ల డాలర్లకు చేరింది. కంపెనీ వృద్ధి అంచనా(గెడైన్స్) 187.5-191.2 కోట్ల డాలర్లకు అనుగుణంగానే ఇది నమోదైంది.

 ఆదాయ గెడైన్స్ 1-3 శాతం...
ఐటీ సేవల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో 190.1-193.9 కోట్ల డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని విప్రో అంచనా వేసింది. గతేడాది క్యూ4తో ఆదాయ గెడైన్స్ 1-3 శాతం అధికంగా ఉంది.

పూర్తి ఏడాదికి చూస్తే...
2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే...విప్రో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.8,892 కోట్లుగా నమోదైంది. 2014-15 ఏడాదిలో లాభం రూ.8,652 కోట్లతో పోలిస్తే 2.7 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం 9.1 శాతం ఎగబాకి రూ.51,631 కోట్లకు చేరింది.

 ఇతర ముఖ్యాంశాలివీ...
రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుకి కంపెనీ రూ.1 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
అనుబంధ సంస్థలతో కలిపి క్యూ4లో విప్రో కొత్తగా 119 క్లయింట్లను సంపాదించింది.
మార్చి 31 నాటికి విప్రో ఐటీ విభాగం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,72,912కు చేరింది. డిసెంబర్ చివరికి ఉన్న 1,70,664 మంది సిబ్బందితో పోలిస్తే నికరంగా 2,248 మంది జతయ్యారు.
మార్చి చివరినాటికి విప్రో వద్ద స్థూలంగా దాదాపు రూ.30,143 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.

 ‘డిజిటల్, కన్సల్టింగ్ సామర్థ్యాలను పెంచుకోవడానికి మేం చేస్తున్న పెట్టుబడులు సత్ఫలితాలిస్తున్నాయి. ఆటోమేషన్, ఇంటిగ్రేటెడ్ సేవల ద్వారా వ్యాపారాన్ని మరింత వృద్ధి పథంలో తీసుకెళ్లడంపై దృష్టిసారిస్తున్నాం’. - అబిదాలి నీముచ్‌వాలా,  విప్రో సీఈఓ

రూ. 2,500 కోట్లతో బైబ్యాక్..
విప్రో డెరైక్టర్ల బోర్డు షేర్ల బైబ్యాక్‌కు బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.2,500 కోట్ల మొత్తంతో 4 కోట్ల వరకూ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రస్తుత కంపెనీ వాటాదారులకు ఆఫర్ ప్రకటించింది. ఇది విప్రో మొత్తం పెయిడ్-అప్ ఈక్విటీ క్యాపిటల్‌లో 1.62 శాతానికి సమానం. కాగా, బైబ్యాక్ షేరు ధరను బోర్డు రూ.625గా ప్రకటించింది. అయితే, బైబ్యాక్ ఎప్పట్నుంచి మొదలుపెట్టేదీ కంపెనీ వెల్లడించలేదు. బుధవారం బీఎస్‌ఈలో విప్రో షేరు 2 శాతం లాభపడి రూ.601 వద్ద ముగిసింది. దీంతో పోలిస్తే బైబ్యాక్ ధర దాదాపు 4 శాతం అధికం కావడం గమనార్హం. 2015 డిసెంబర్ చివరినాటికి విప్రోలో ప్రమోటర్ల వాటా 73.35 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement