
వర్షాభావ గండం..!
రానున్న కాలంలో దేశం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందటం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటం వంటి చర్యలకు వర్షాభావ గండం పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది...
- రుతుపవనాల అనిశ్చితితో వృద్ధికి దెబ్బ!
- ద్రవ్యోల్బణం కట్టడి కూడా కష్టమే
- ఆహార నిర్వహణ వ్యూహం కావాలి
- వార్షిక నివేదికలో ఆర్‌బీఐ వెల్లడి
ముంబై: రానున్న కాలంలో దేశం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందటం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటం వంటి చర్యలకు వర్షాభావ గండం పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన రుతుపవనాల విస్తరణ, పురోగతిపై అనిశ్చితి నెలకొనడమే దీనికి కారణమని తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. ‘ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం బాగానే ఉంది. కరువు భయాలు తొలిగాయి.
అయితే, సరైన సమయంలో రుతుపవనాలు విస్తరించలేదు. దీంతో వర్షపాతం విషయంలో అనిశ్చితి నెలకొంది. ఇది ఆర్థిక వ్యవస్థపైన, ద్రవ్యోల్బణంపైన రిస్క్‌లను పెంచుతోంది. ఈ నేపథ్యంలో వర్షాభావం వల్ల తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఒక సమగ్రమైన ముందస్తు ఆహార నిర్వహణ(ఫుడ్ మేనేజ్‌మెంట్) వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఆర్‌బీఐ వివరించింది. ఈ ఏడాది(2015-16) తొలి నాలుగు నెలల్లో సంకేతాలను పరిశీలిస్తే.. తమ వృద్ధి అంచనాలకు (7.6 శాతం) అనుగుణంగానే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లు కనబడుతోందని కూడా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం, రుతుపవనాల ఆరంభ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఏడాది జనవరికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండొచ్చని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ అంచనా వేయటం తెలిసిందే. అయితే, బేస్ ఎఫెక్ట్‌కారణంగా ఆగస్టు వరకూ కాస్త తగ్గుముఖం పట్టినా, ఆ తర్వాత మళ్లీ పెరగవచ్చని... 2017 జనవరికల్లా 6 శాతం దిగువకు ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం ఉందని తాజాగా పేర్కొంది. ఇప్పటివరకూ తమ అంచనాలకు అనుగుణంగానే ద్రవ్యోల్బణం కదలికలున్నాయన్నారు.
ద్రవ్యోల్బణం, మొండిబకాయిలపై దృష్టి: రాజన్
ఆర్‌బీఐ రెండు ప్రధానాంశాలపై దృష్టి సారిస్తోంది. అందులో ఒకటి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం. మరొకటి బ్యాంకుల మొండి బకాయిల సమస్య పరిష్కారం. వార్షిక నివేదికలో ఆర్‌బీఐ గవర్నర్‌రాజన్ ఈ విషయాలను తెలిపారు. ఎన్‌పీఏల పరిష్కారం దిశలో చర్యలు తీసుకుని, బ్యాంక్‌ల వద్ద తగిన మూలధనం ఉండేలా ఆర్‌బీఐ కృషి ఉంటుందని అన్నారు. బ్యాంకుల ఎన్‌పీఏల పరిస్థితి మెరుగుపడి, మూలధన పరిపుష్టి చేకూరితే... రుణ సామర్థ్యం మెరుగుపడుతుందని, రెపో (ప్రస్తుతం 7.25 శాతం) ప్రయోజనాన్ని మరింతగా కస్టమర్లకు బదలాయించడం సులభతరం అవుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు.
స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ తగిన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... ద్రవ్యోల్బణం కట్టడి, బ్యాంకులు బేస్ రేటు తగ్గింపు, తద్వారా వృద్ధికి ఊతం వంటి అంశాలపై ఆర్‌బీఐ ప్రధానంగా దృష్టి పెడుతోందన్నారు. ఎన్‌పీఏలపై బ్యాంకుల భయాలను ఆసరాగా చేసుకుని కొన్ని బడా కార్పొరేట్ ప్రమోటర్లు అసమంజస డిమాండ్లతో రుణ పునర్‌వ్యవస్థీకరణలను కోరుతున్నారనీ అన్నారు. భారత్‌కు మరింత వృద్ధి సత్తా ఉందన్నారు.