పొదుపు పట్ల మహిళల్లో అప్రమత్తత | Women are recklessly cautious with savings | Sakshi
Sakshi News home page

పొదుపు పట్ల మహిళల్లో అప్రమత్తత

Published Thu, Oct 31 2019 5:19 AM | Last Updated on Thu, Oct 31 2019 5:19 AM

Women are recklessly cautious with savings - Sakshi

న్యూఢిల్లీ: పొదుపు విషయమై మహిళల్లో అధిక అప్రమత్తత ఉంటున్నట్టు ఓ సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) లేదా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికే 58 శాతం మంది మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. లేదంటే బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచేస్తున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా ఆర్థిక సేవలు అందించే స్క్రిప్‌బాక్స్‌ అక్టోబర్‌ నెల మొదటి రెండు వారాల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి.

ఇక మరో 6 శాతం మంది మహిళలు బంగారం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం గమనార్హం. అదనపు ఆదాయాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులుగా పెడతామని 15 శాతం మగువలు చెప్పారు. ప్రముఖ ఫేస్‌బుక్‌ కమ్యూనిటీల ఆధారంగా 400 మంది మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించి స్క్రిప్‌బాక్స్‌ ఈ వివరాలు వెల్లడించింది. వీరిలో 54 శాతం మంది మిలీనియల్స్‌ (1980–2000 మధ్య జన్మించిన వారు) ఉన్నారు.  

► సర్వేలో పాలు పంచుకున్న మిలీనియల్స్‌లో మూడొంతులు మంది పొదుపు పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు సర్వే తెలిపింది.  
► ప్రతీ ఆరుగురు మిలీనియల్స్‌లో ఒకరు విహార యాత్రల కోసం డబ్బును పక్కన పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
► నాన్‌ మిలీనియల్స్‌ మహిళల్లో సగం మంది రిటైర్మెంట్‌ నిధి, పిల్లల విద్య కోసం కొంత మేర పక్కన పెడతామని వెల్లడించారు.  
► ఈ వయసు గ్రూపులోని వారికి పన్ను ఆదా చేసే పీపీఎఫ్, ఎల్‌ఐసీ పథకాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ప్రాముఖ్యంగా ఉన్నాయి. నాన్‌ మిలీనియల్స్‌లో 33% మంది వీటికే ఓటేశారు. 26% మంది మాత్రం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సాయపడతాయని చెప్పారు.
► అవసరమైన సందర్భాల్లో తమ కష్టార్జితాన్ని సులభంగా, వెంటనే పొందే వెసులుబాటు ఉండాలని సర్వేలో పాల్గొన్న మహిళల్లో 44 శాతం మంది పేర్కొన్నారు.
► అత్యవసర నిధికి ఎక్కువ మంది మొగ్గు చూపించారు. 36 శాతం మంది అజెండాలో దీనికే అగ్ర ప్రాధాన్యం ఉంది. తర్వాత పిల్లల విద్య కోసం 28 శాతం మంది, రిటైర్మెంట్‌ కోసం నిధి ఏర్పాటుకు 26 శాతం మంది మొగ్గు చూపించారు.  
► తమకు ఎటువంటి ఆర్థిక లక్ష్యం లేదని 25 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆర్థిక ప్రణాళిక ఏర్పాటు, ఆర్థిక లక్ష్యాల సాధన విషయంలో 28 శాతం మంది నమ్మకంగా ఉన్నారు.


పొదుపు, మదుపు వేర్వేరు..  
పొదుపు చేయడం, పెట్టుబడి(మదుపు) పెట్టడం అనేవి నాణేనికి రెండు ముఖాలు. కానీ వీటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసమే ఉంది. అత్యవసరాల కోసం డబ్బులను పక్కన పెట్టుకోవడం పొదుపు అవుతుంది. దీనిపై రాబడులు నామమాత్రంగాను లేదా అసలు లేకపోవచ్చు. కానీ పెట్టుబడులు అనేవి సంపదను సృష్టించుకునేందుకు క్రమబద్ధమైన విధానం. ద్రవ్యోల్బణాన్ని మించి నికర విలువ వృద్ధి చెందేందుకు, పిల్లల విద్య, రిటైర్మెంట్‌ అవరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు మార్కెట్‌ ఆధారిత (ఈక్విటీ) ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు తోడ్పడతాయి’’అని స్క్రిప్‌బాక్స్‌ సీఈవో ఆశిష్‌ కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement