ప్రపంచ చోదక శక్తిగా భారత్!
- చైనా స్థానాన్ని సొంతంచేసుకునే సత్తా ఉందన్న అరుణ్‌జైట్లీ
- అయితే దీనికి 8-9 శాతం శ్రేణిలో వృద్ధి రేటు అవసరమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ప్రపంచ వృద్ధి ఇంజిన్ చోదకునిగా చైనా స్థానాన్ని సంపాదించే సత్తా భారత్‌కు ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అయితే ఇందుకు భారత్ తొలుత 8 నుంచి 9 శాతం శ్రేణిలో వృద్ధిరేటును సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో ఇటీవలి సంక్షోభాన్ని భారత్ తనకు సానుకూలంగా మార్చుకోవడం ద్వారా వృద్ధి వేగాన్ని పెంచుకోవచ్చన్నారు. అయితే ఇందుకు దేశంలో ఆర్థిక సంస్కరణలను పటిష్టవంతంగా ముందుకు నడిపించాల్సి ఉంటుందని అన్నారు.
ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు. భారత్‌లో వ్యాపారాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే మోదీ ప్రభుత్వం ప్రపంచ ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పించిందని బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్యూలో ఆయన అన్నారు. ఇన్వెస్టర్ అనుకూల వాతావరణం సృష్టికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే దేశం 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.