వృద్ధి జోరుకు నోట్ల రద్దు బ్రేక్!
2016–17లో వృద్ధి 7 శాతమే
• అంచనాలు తగ్గించిన ప్రపంచబ్యాంక్
• నోట్ల రద్దు కారణమని విశ్లేషణ
• క్రితం అంచనా 7.6 శాతం
• భవిష్యత్తుపై ఆశావహ అభిప్రాయం
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి స్పీడ్‌కు రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తక్షణం బ్రేకులు వేస్తుందని ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్–మార్చి)లో వృద్ధి కేవలం 7 శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తన క్రితం 7.6 శాతం అంచనాలను కుదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) 7.1 శాతం అంచనాలకన్నా ప్రపంచబ్యాంక్ తాజా అంచనాలు తక్కువ కావడం గమనార్హం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి తగ్గినా... రానున్న సంవత్సరాల్లో మళ్లీ వృద్ధి 7.6 శాతం, 7.8 శాతానికి పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలే దీనికి కారణమనీ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక ధోరణులపై ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదల చేసింది. నవంబర్ 8వ తేదీన దేశంలో డీమోనిటైజేషన్ ప్రభావం, తదుపరి పరిణామాలను ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో విశ్లేషించింది.
ముఖ్యాంశాలు చూస్తే...
⇔ పెద్ద నోట్ల రద్దు 2016లో వృద్ధిని మందగించేట్లు చేస్తుంది. చమురు ధరల అనిశ్చితి, వ్యవసాయ, తయారీ రంగాలు వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయి. 2016–17 చివరి త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత కొరవడనుందని తయారీ, మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌లు (పీఎంఐ) కూడా పేర్కొనడం గమనార్హం.
⇔ భారత్ వృద్ధి రేటు తగ్గినా... అది చైనాకన్నా ఎక్కువగానే ఉండడం వల్ల ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగనుంది.
⇔ దేశంలో సరఫరాల సమస్యల పరిష్కారానికి, ఉత్పాదకత మెరుగుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలు దోహదపడతాయని భావిస్తున్నాం. వచ్చే రెండేళ్లలో వృద్ధి పెరుగుదల అంచనాలకు ఇది ప్రధాన కారణం.
⇔ సమీపకాలంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డానికి, పెట్టుబడులు పెరగడానికి మౌలిక రంగంలో భారీ వ్యయాలు దోహదపడతాయి.
⇔ మేక్ ఇన్ ఇండియా ప్రచారం... భారత తయారీ రంగానికి దోహదపడుతుంది. దేశంలో నెలకొన్న డిమాండ్, ప్రభుత్వం తీసుకొస్తున్న నియంత్రణపరమైన సంస్కరణలు ఈ దిశలో ప్రయోజనాలకు దారితీస్తుంది.
⇔ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, వేతనాల పెంపు... వాస్తవ ఆదాయాలు, వినియోగం పెరగడానికి దోహదపడతాయి. తగిన వర్షపాతంతో పంట దిగుబడి పెరగడం ఆర్థిక వృద్ధికి దోహదపడే అంశం.
⇔ పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకింగ్ వద్ద ద్రవ్య లభ్యత పెరిగింది. ఇది కనిష్ట వడ్డీరేట్ల వ్యవస్థకు దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డానికి దోహదపడుతుంది. అయితే దేశం నగదు ఆధారితమైనందున, తక్షణం వ్యాపార అవరోధాలకు, కుటుంబ కొనుగోళ్లు తగ్గడానికి దారితీస్తుంది.
⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నిజానికి భారత్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు మందగించాలి. పారిశ్రామిక వృద్ధి బాగోలేదు. ఎగుమతులూ పెరగలేదు. అయితే ప్రైవేటు, ప్రభుత్వ వ్యయాలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు లాభించింది. దిగువస్థాయి ఇంధన ధరలు, వేతనాలు, పెన్షన్ల పెరుగుదల, తగిన వర్షపాతం వంటి అంశాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయాలు పెంచాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగడం కూడా ఆర్థిక క్రియాశీలతకు దోహదపడింది. మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు ఎగశాయి.
⇔ గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడులు 21 శాతం పెరిగితే, ప్రైవేటు పెట్టుబడుల్లో అసలు వృద్ధిలేకపోగా 1.4 శాతం క్షీణించింది.
⇔ తయారీ రంగంసహా పలు విభాగాలకు సంబంధించి విదేశీ డిమాండ్ బలహీనత, కొత్త ప్రాజెక్టులకు ప్రోత్సాహం లేకపోవడం, విధానపరమైన అనిశ్చితి ప్రైవేటు పెట్టుబడుల మందగమనానికి కారణం. ఉదాహరణకు భూ సేకరణలకు సంబంధించి నష్టపరిహార చెల్లింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం తగిన విధంగా లేదు. ఇందుకు సంబంధించి చట్ట సవరణల విషయంలో జాప్యం జరుగుతోంది. ఇక ఇప్పటికే రుణ భారంతో ఉన్న మౌలిక రంగ కంపెనీలకు బ్యాంకింగ్ రుణాలు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా ఇక్కడ విద్యుత్, స్టీల్, సిమెంట్ వంటి రంగాలను ప్రస్తావించుకోవచ్చు.
⇔ దక్షిణ ఆసియా మొత్తంగా పెట్టుబడులు మందగిస్తున్నాయి.