చైనా వెనక్కి.. భారత్ ముందుకు! | World Bank Projects India's GDP to Surpass China's by 2017 | Sakshi
Sakshi News home page

చైనా వెనక్కి.. భారత్ ముందుకు!

Published Thu, Jan 15 2015 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

చైనా వెనక్కి.. భారత్ ముందుకు!

చైనా వెనక్కి.. భారత్ ముందుకు!

 వాషింగ్టన్: ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో మళ్లీ భారత్ చైనాతో పోటాపోటీగా దూసుకెళ్లనుంది. అంతేకాదు 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు స్వల్పంగా చైనాను అధిగమించి 7 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ తాజాగా నివేదిక అంచనా వేసింది. ఇదే ఏడాది చైనా వృద్ధి రేటు 6.9 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. ‘ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం-అంచనాలు’ పేరుతో ఈ నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ప్రధానంగా మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల భారీ పతనం, తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు వంటివి భారత్ ఆర్థిక వ్యవస్థకు చోదకంగా నిలవనున్నాయని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిండెంట్ కౌశిక్ బసు పేర్కొన్నారు.

‘చైనా వృద్ధి పటిష్టంగానే కొనసాగనుంది. 2015-16లో 7 శాతంగా ఉండొచ్చు. అయితే, 2016-17లో మాత్రం కాస్త తగ్గి 6.9 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్ ఈ రెండు ఏడాదిల్లోనూ వరుసగా 7% చొప్పున వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇటీవలి కాలంలో భారత్.. చైనాతో పోటీగా వృద్ధిని సాధించడం ఇదే తొలిసారి కానుంది కూడా’ అని బసు  చెప్పారు. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...   
 
 గతేడాది(2014) భారత్ వృద్ధి 5.6%గా ప్రపంచ బ్యాంక్ లెక్కగట్టింది. ప్రస్తుత 2015 సంవత్సరంలో ఇది 6.4% ఉండొచ్చని అంచనా వేసింది.
 
 చైనా విషయానికొస్తే.. 2014లో 7.4% వృద్ధి చెందగా.. 2015లో 7.1% ఉంటుందని అంచనా.
 
 దక్షిణాసియా దేశాల మొత్తం వృద్ధిరేటు 2013 ఏడాదిలో పదేళ్ల కనిష్టానికి(4.9 శాతం) పడిపోగా.. 2014లో 5.5 శాతానికి పుంజుకుంది. ప్రధానంగా, ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటం దీనికి దోహదం చేసింది.
 
 భారత్‌లో సంస్కరణల జోరుతో సరఫరాపరమైన అడ్డంకులు తొలగనున్నాయి. దీంతో 2017లో దక్షిణాసియా వృద్ధి రేటు 6.8%కి పుంజుకోవచ్చు.
 
 సంస్కరణల విషయంలో వెనక్కితగ్గితే.. వృద్ధి రికవరీ మళ్లీ పడిపోయే ప్రమాదం ఉంది.
 
 ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3 శాతం...
 పలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు గతంతో పోలిస్తే కాస్త మందగించిన నేపథ్యంలో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు రికవరీ వేగం పుంజుకోవడం లేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 2014లో గ్లోబల్ జీడీపీ వృద్ధి 2.6% ఉండగా.. ఈ ఏడాది(2015)లో ఇది 3%కి పెరగవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. 2016లో 3.3%, 2017లో 3.2% చొప్పున వృద్ధికి ఆస్కారం ఉందని పేర్కొంది.
 
 ఐరాస భారత్ వృద్ధి అంచనా 6.4 శాతం...
 భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2015) 6.4%  వృద్ధి చెందొచ్చని ఐక్యరా జ్యసమితి(ఐరాస) నివేదిక అంచనావేసింది. 2014లో వృద్ధి రేటు 5.5%గా పేర్కొంది. ఆసియా, పసిఫిక్ దేశాల్లో సర్వే ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. మోదీ  సర్కారు అమలు చేస్తున్న సంస్కరణలు, విధానపరమైన చర్యలతో వ్యాపార రంగం, వినియోగదారుల్లో విశ్వాసం పెరిగిందని అభిప్రాయపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement