వచ్చే ఏడాది 6% పైనే.. : ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2014-15) 6% పైగానే నమోదవుతుందన్న అంచనాలను ప్రపంచబ్యాంక్ వెలువరించింది. 2016-17లో ఈ రేటు 7.1%కి పెరుగుతుందని విశ్లేషించింది. ‘ప్రపంచ ఆర్థికాభివృద్ధి అవకాశాలు’ శీర్షికతో బుధవారం విడుదలైన తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ అంచనాలను ప్రకటించింది. భారత్ వృద్ధికి ప్రపంచ డిమాండ్‌లో రికవరీ, దేశీయంగా పెట్టుబడుల మెరుగుదల దోహదపడతాయని వివరించింది. కాగా చైనా 2014లో కూడా వృద్ధి 7.7%గా ఉంటుందని అభిప్రాయపడింది.
ప్రపంచ ఆర్థికవృద్ధి 3.4 శాతం
కాగా ప్రపంచం మొత్తంగా జీడీపీ వృద్ధి 2013లో 2.4 శాతంకాగా ఇది 2014లో 3.2 శాతానికి పెరగవచ్చని వివరించింది. 2015, 2016ల్లో ఈ రేట్లు 3.4 శాతం, 3.5 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి ఊపందుకోవడం వల్ల ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత తిరిగి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ కిమ్ అన్నారు.