జోరుగానే భారత్ వృద్ధి
ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నివేదికలు
కనిష్ట చమురు ధరలు, సానుకూల డిమాండ్ పెట్టుబడుల్లో పెరుగుదల
2015-16లో వృద్ధి 7.5 శాతంగా అంచనా...
వాషింగ్టన్: భారత్ ఆర్థికాభివృద్ధి పటిష్టంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థలు తమ వేర్వేరు నివేదికల్లో పేర్కొన్నాయి. తక్కువ స్థాయిలో కొనసాగుతున్న చమురు ధరలు, దేశంలో నెలకొన్న మంచి డిమాండ్ పరిస్థితులు, పెట్టుబడుల పెరుగుదల ధోరణి వంటి అంశాలు భారత్ పటిష్ట వృద్ధికి సహకరిస్తున్న అంశాలని ప్రపంచబ్యాంక్ విశ్లేషించింది. దక్షిణ ఆసియా ఆర్థిక వ్యవస్థపై ఆరు నెలలకు ఒకసారి విడుదల చేసే నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ అంశాలను తెలిపింది. ఇక వృద్ధి స్పీడ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే చైనాను భారత్ అధిగమిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అటు ప్రపంచబ్యాంక్, ఇటు ఐఎంఎఫ్ రెండూ ఈ ఏడాది (2015-16) వృద్ధి రేటు 7.5 శాతమని అంచనావేశాయి.
ప్రపంచబ్యాంక్ నివేదికలో ముఖ్యాంశాలు...
2017-18 నాటికి దేశం 8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సాధిస్తుంది.
2015-2016 : 2017-2018 ఆర్థిక సంవత్సరాల మధ్య పెట్టుబడుల్లో వృద్ధి రేటు భారీగా 12 శాతంగా ఉండొచ్చు. పటిష్ట ఆర్థిక వృద్ధికి దోహదపడే అంశం ఇది.
దేశాభివృద్ధి ఇప్పటి వరకూ వినియోగ ఆధారితంగా ఉంది. ఇకపై దీనిని పెట్టుబడుల ఆధారితంగా రూపొందించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో చైనా తన వృద్ధిని పెట్టుబడుల ప్రాతిపదిక నుంచి వినియోగ ఆధారితం వైపునకు తీసుకెళ్తోంది.
దక్షిణాసియా వృద్ధి రేటు 2015లో 7 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2017 నాటికి ఇది 7.6 శాతానికి వృద్ధి చెందే అవకాశం. భారత్ వృద్ధి పరుగు మొత్తం ఈ ప్రాంతానికి లాభిస్తున్న అంశం. సంస్కరణలు, మెరుగుపడిన ఇన్వెస్టర్ సెంటిమెంట్ భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశాల్లో కొన్ని.
భారత్ వృద్ధి పరుగు: ఐఎంఎఫ్
7.5 శాతం రేటుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే చైనా వృద్ధి రేటును భారత్ అధిగమించే అవకాశం ఉంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ పొందనుంది.
ఇంతక్రితం జనవరిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును ఐఎంఎఫ్ 6.3గా పేర్కొంది. ఈ రేటును 7.5 శాతానికి పెంచడానికి ఇటీవల కేంద్రం తీసుకున్న విధాన సంస్కరణలు, పెట్టుబడుల్లో వృద్ధి ధోరణి, తక్కువ స్థాయిలో చమురు ధరలు కారణం.
2014లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. 2015లో ఇది 7.5 శాతానికి చేరుతుంది. 2014లో చైనా వృద్ధి రేటు 7.4 శాతంకాగా, 2015లో ఈ రేటు 6.8 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2016లో ఇది మరింతగా తగ్గి 6.3 శాతానికి చేరుతుంది.
రెమిటెన్సుల్లో మనమే టాప్
విదేశాల్లో నివసిస్తున్న వారు స్వదేశంలోని తన వారికి పంపే నిధులకు సంబంధించిన ‘రెమిటెన్సెస్’ విషయంలో భారత్ తన ఆధిక్యతను కొనసాగిస్తోందని ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌసిక్ బసు తెలిపారు. భారత్ నుంచి వెళ్లి... వివిధ దేశాల్లో పనిచేస్తున్న వారు స్వదేశానికి 2014లో 70 బిలియన్ డాలర్లను పంపినట్లు ఆయన తెలిపారు. చైనా విషయంలో ఈ మొత్తం 64 బిలియన్ డాలర్లు. 2015లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్లే రెమిటెన్సుల విలువ దాదాపు 440 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలి పారు. 2014తో పోల్చితే ఇది 0.9% అధికం.
ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్సుల విలువ 2015లో 0.4% వృద్ధితో 586 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెమిటెన్సులు పంపుతున్న దేశాల తొలి 5 స్థానాల్లో అమెరికా, సౌదీ , జర్మనీ, రష్యా, యూఏఈలు ఉన్నాయి. పుచ్చుకుంటున్న దేశాల్లో తొలి ఐదు స్థానాల్లో భారత్, చైనా, ఫిలిప్పైన్స్, మెక్సికో, నైజీరియాలు ఉన్నాయి. ఇంతటి భారీ స్థాయిలో నిధుల ప్రవాహం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే అంశమని కౌశిక్ బసు అన్నారు.