టిక్.. టిక్..ఫెడ్ ! | World eye on Central Bank of the United States of America | Sakshi
Sakshi News home page

టిక్.. టిక్..ఫెడ్ !

Published Wed, Sep 16 2015 2:22 AM | Last Updated on Fri, Aug 24 2018 4:48 PM

టిక్.. టిక్..ఫెడ్ ! - Sakshi

టిక్.. టిక్..ఫెడ్ !

ప్రపంచం చూపు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైపు...

 రేట్ల పెంపుపై రేపు సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం
 అదే జరిగితే ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు
 అంచనాలు... అటు-ఇటూ!  ప్రభావాన్ని ఎదుర్కొంటామంటున్న భారత్

 
 ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘సెప్టెంబర్ 17’వ తేదీ వచ్చేస్తోంది. ఆ రోజున అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్  పస్తుతం 0-0.25 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటును పెంచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలే దీనికి కారణం. ఇదే జరిగితే 9 సంవత్సరాల తర్వాత అమెరికా ఈ రేటు పెంచినట్లవుతుంది.

 అవకాశాలు తక్కువే: బాండ్ మార్కెట్
 అమెరికాలోని బాండ్ మార్కెట్ మాత్రం రేటు పెంపు అవకాశాలు తక్కువేనని భావిస్తోంది. ఇందుకు కేవలం 20 శాతం అవకాశాలే ఉన్నాయని అంచనా వేస్తోంది. ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది బాండ్ మార్కెట్ అంచనా. ప్రపంచ అస్పష్ట మార్కెట్ పరిస్థితులు దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతోంది. అయితే ఏదైనా ఆశ్చర్యకరమైన నిర్ణయం చోటుచేసుకుంటే మాత్రం మార్కెట్‌లో భారీ కదలికలు తప్పవన్న అంచనాలు ఉన్నాయి.

 కఠినమా... సరళమా..?
 ఒక్క అమెరికా సానుకూల పరిస్థితులను పరిగణించి ఫెడ్ కఠిన విధానం అవలంబిస్తుందా? లేక మొత్తం ప్రపంచ అనిశ్చితి పరిస్థితులను అనుసరించి సరళతర విధానం అవలంబిస్తుందా? అన్న అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. వాటిని క్లుప్తంగా చూస్తే...

     ఇప్పటికి ఇప్పుడు పెంపు ఉండదు. అయితే అక్టోబర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని ఫెడ్ కమిటీ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నిర్ణయం తక్షణం అమెరికా బాండ్ మార్కెట్‌కు, డాలర్‌కు కలిసి వచ్చేదే. స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అనిశ్చితి కొనసాగుతుంది.

     25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంపును అమెరికా ఆర్థిక ఫండమెంటల్స్ అనుమతినిస్తున్నాయి.  చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల మందగమనం సమస్యలు ఫెడ్‌కు తెలుసు. అయితే ఇవేమీ ప్రస్తుత రేటు పెంపునకు భారీ అడ్డంకి కాకపోవచ్చు. మున్ముందు పరిస్థితి మరింత బాగుంటే డిసెంబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల రుణ రేటు పెంపు అవకాశమూ ఉంది.

     ఆర్థిక పరిస్థితులు చక్కబడితే 25 బేసిస్ పాయింట్లు రేటు పెంపు ఉంటుందని ఫెడ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. ఇలా జరిగితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ పరిణామాలు ఎంతకాలం ఎలా ఉంటాయన్నది పరిశీలించాల్సి ఉంటుంది.

     దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా  రేట్ల పెంపు ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది చివరికి ఈ నిర్ణయం వాయిదా పడవచ్చు. అనిశ్చితి కొనసాగడం ప్రతికూలంశమే.

     ఫెడ్  తీరు పూర్తి సరళమే. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంచితే తీవ్ర ప్రతికూల ఫలితాలు అంతర్జాతీయంగా తలెత్తవచ్చు. ఈ కారణాల వల్ల 2015లో రేట్ల పెంపు వుండకపోవచ్చు. ఇదే జరిగితే ఈక్విటీ మార్కెట్లో భారీ ర్యాలీ చోటుచేసుకుంటుంది.  
 
 ఎందుకింత ఉత్కంఠ..!
 2008 ఆర్థిక సంక్షోభాన్నుంచి గట్టెక్కి, వృద్ధికి ఊపును అందించడానికి ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధుల్ని కుమ్మరించడం. రెండవది తక్కువ వడ్డీరేటుకు రుణాలను అందించడం కోసం ఫండ్స్ రేటు జీరో స్థాయికి తగ్గించడం. ఫండ్స్ రేటు తగ్గడాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే- అతి తక్కువ రేటుకు బ్యాంకులకు రుణాలు లభిస్తాయన్నమాట. ఇలా లభించిన చౌక మొత్తాలను మార్కెట్లో చౌకగా బ్యాంకులు రుణాలిచ్చాయి. అమెరికా ఇన్వెస్టర్లు ప్రపంచ వ్యాప్తంగా షేర్లు, కమోడిటీలు తదితరాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థ కుదుటపడిన తర్వాత ఫెడ్ ఈ ఉద్దీపన ఎప్పటికైనా వెనక్కు తీసుకోక తప్పదు.

ఇందులో భాగంగా ప్రతీ నెలా బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపించే నిధుల్ని గతంలోనే ఫెడ్ నిలుపుచేసింది. అయితే అమెరికా ఆర్థిక పరిస్థితుల క్లిష్టత దృష్ట్యా ఎప్పటికప్పుడు ‘రేట్ల పెంపు’ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడింది.  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 0.6 శాతం అమెరికా ఆర్థికాభివృద్ధి నమోదయితే,  రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.  ఈ నేపథ్యంలో రేట్ల పెంపు పై అంచనాలు పెరిగాయి.  

ప్రస్తుతం 0-0.25 శాతంగా ఉన్న ఈ రేటు ఏ మాత్రం పెరిగినా... అమెరికా ఇన్వెస్టర్లపై వడ్డీ వ్యయ భారం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వారు వివిధ దేశాల్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కు తీసుకువెళ్లి... రుణ పునః చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే జరిగితే పలు ప్రపంచ దేశాలు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) కొరత పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. వెరసి తిరిగి పలు దేశాలు ఆర్థిక మందగమనంలోకి జారుకునే అవకాశం ఉంది.
 
 భారత్ పరిస్థితి..
  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భారత్‌సహా పలు దేశాలు అమెరికాకు సూచిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే- ఫెడ్ జాగరూకతతో నిర్ణయం తీసుకుంటుందని ఒకపక్క పేర్కొంటూనే... మరోపక్క  ఒకవేళ ఫెడ్ రేటు పెరిగితే ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధమై ఉన్నామని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. స్వయంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ లాంటి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఇదే విధమైన ప్రకటనలు చేశారు.

కాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్  రిజర్వ్ వడ్డీరేటు పెంచితే భారత్‌కు సానుకూలమేనని  ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ పేర్కొంటోంది.  ఫెడ్ నిర్ణయం ఆలస్యం అయిన కొద్దీ దేశంలోకి పెట్టుబడుల ప్రవాహంలో అనిశ్చితి నెలకొంటుందని, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడతాయని పేర్కొంది. త్వరగా ఈ అంశం తేలిపోతే చక్కటి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన దేశంగా భారత్‌కు భారీ పెట్టుబడులు ఖాయమన్నది ఆ సంస్థ విశ్లేషించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement