ఇక షావోమీ.. వ్యక్తిగత రుణాలు | Xiaomi Enters Online Lending Space In India With Mi Credit | Sakshi
Sakshi News home page

ఇక షావోమీ.. వ్యక్తిగత రుణాలు

Published Wed, Dec 4 2019 2:22 AM | Last Updated on Wed, Dec 4 2019 2:22 AM

Xiaomi Enters Online Lending Space In India With Mi Credit - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన షావోమీ.. భారత్‌లో రుణ మంజూరీ సేవలను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇక్కడ మార్కెట్‌కు సుపరిచితమైన ఈ సంస్థ.. మొబైల్‌ అప్లికేషన్‌ ఆధారంగా వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మీ క్రెడిట్‌’ పేరిట యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రూ. లక్ష వరకు రుణం పొందవచ్చని వివరించింది. ఈ అంశంపై కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్, ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్‌ ద్వారా వ్యక్తిగత రుణాలను అందించడానికి మీ క్రెడిట్‌ యాప్‌ను అధికారికంగా ప్రారంభించాం. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు పైలట్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి.అత్యంత తక్కువ ప్రొసెసింగ్‌ సమయంతో రుణం పొందే విధంగా యాప్‌ను రూపొందించాం’ అని చెప్పారు.

ప్రస్తుతం రుణ భాగస్వాముల జాబితాలో ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ లిమిటెడ్, మనీ వ్యూ, ఎర్లీశాలరీ, జెస్ట్‌మనీ, క్రెడిట్‌విద్యా వంటి బ్యాంకింగేతర సంస్థలు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తగత రుణ పద్ధతిలో ఉన్న సవాళ్లను అధిగమిస్తూ.. డిజిటల్‌ పద్ధతిలో రుణ మంజూరీ చేయనున్నామని వివరించిన ఆయన.. యువ నిపుణులు, మిలీనియల్స్‌ (1980– 2000 మధ్య జని్మంచినవారు) తమ లక్ష్యమని చెప్పారు. విని యోగదారు డేటా సురక్షితంగా ఉండడం కోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో షావోమీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో రూ. 28 కోట్లను మంజూరు చేసింది. ఇందులో 20% మంది రూ. లక్ష రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 1,500 పిన్‌కోడ్‌లలో సేవలు అందుబాటులో ఉండగా.. 2019–20 చివరినాటికి 100% పిన్‌కోడ్‌లలో సేవలు విస్తరించా లని భావిస్తోంది. ఇక షావోమీ ఫోన్‌ యూజర్లకు క్రెడిట్‌ స్కోర్‌ను ఉచితంగా అందిస్తోంది.

ఫైనాన్షియల్‌ సేవలపై దృష్టి
భారత్‌లో ఇప్పటికే ‘మీ పే’ పేరిట యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్‌ సేవలను అందిస్తోన్న ఈ సంస్థ.. రానున్నకాలంలో మరిన్ని ఫైనాన్షియల్‌ సేవలను ఇక్కడి మార్కెట్లో అందించనున్నట్లు ప్రకటించింది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ‘మీ క్రెడిట్‌’కు వచ్చే స్పందన ఆధారంగా విస్తృత సేవలను తీసుకుని రానున్నట్లు వివరించింది. ఇక 2023 నాటికి ఆన్‌లైన్‌ క్రెడిట్‌ వ్యాపారం రూ. 70 లక్షల కోట్లకు చేరుకోనుందని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల విలువైన వ్యక్తిగత రుణాలను 1.9 కోట్ల మంది కస్టమర్లు పొందారని, వీరి అవుట్‌స్టాండింగ్‌ అమౌంట్‌ రూ. 2 లక్షలుగా ఉన్నట్లు సిబిల్‌ రిపోర్ట్‌ ద్వారా వెల్లడైనట్లు షావోమీ వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement