నోట్7 మాదిరిగా.. రెడ్‌మి నోట్4 బ్లాస్ట్
నోట్7 మాదిరిగా.. రెడ్‌మి నోట్4 బ్లాస్ట్
Published Mon, Jul 24 2017 6:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల పేలుడు ఘటనలు ఇంకా పూర్తిగా మరవనలేదు. తాజాగా మరో ఫేమస్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ కూడా పేలిపోయింది. బెంగళూరులోని ఓ షాపులో షావోమి రెడ్‌మి నోట్4కు పేలుడు ప్రమాదం సంభవించింది. కస్టమర్‌కు చెందిన రెడ్‌మి నోట్ 4 ఫోన్‌లో షాప్‌కీపర్ సిమ్‌ను ఇన్‌సర్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఒక్కసారిగా ఈ పేలుడు ప్రమాదం సంభవించడంతో ఫోనంతా కాలిపోయింది. అయితే రెడ్‌మి నోట్ 4 పేలిన సమయంలో ఆ ఫోన్ ఛార్జింగ్‌లో కానీ లేదా మరే ఇతర యాక్ససరీస్‌ను కానీ దానికి కనెక్ట్ చేయలేదు. రిటైలర్ దాన్ని హ్యాండిల్ చేస్తున్న క్రమంలోనే మంటల సంభవించాయి. చాలా కేసుల్లో హ్యాండ్‌సెట్‌కు ఛార్జింగ్ పెట్టి ఉన్న సమయంలో బ్యాటరీ ఓవర్‌హీట్ అయి, పేలుడు ఘటనలు జరిగేవి. కానీ ఇలా పేలుడు ఘటన జరగడం చాలా అరుదని తెలుస్తోంది.
అయితే దీనిపై స్పందించిన షావోమి కంపెనీ.. తమకు వినియోగదారుడి భద్రతే అత్యంత ముఖ్యమని, ఈ విషయంపై వినియోగదారుడిని సంప్రదించి విచారణ చేపడతామని చెప్పింది. ఆ ఫోన్‌కు బదులు మరో షావోమి రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్‌కి అందించింది. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడలేదని షావోమి తెలిపింది. ఒకవేళ ఫోన్‌ను మాట్లాడుతున్న క్రమంలో పేలుడు సంభవిస్తే, తీవ్రమైన గాయాలే అయ్యేవని, ఇది చాలా అదృష్టమని తెలిపింది. అంతకముందు గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలతో శాంసంగ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఫోన్ తరుచు పేలుడు ఘటనలకు ప్రభావితం కావడంతో, శాంసంగ్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఓ వైపు కంపెనీ రెవెన్యూలు, మరోవైపు కంపెనీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు ఘటనలు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగులుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో షావోమి ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.
Advertisement
Advertisement