యాహూ సీఈవో మరిస్సా బోనస్ కట్
శాన్ ఫ్రాన్సిస్కో: హ్యాకింగ్ ఉదంతం నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం యాహూ సీఈవో మరిస్సా మేయర్ వార్షిక బోనస్‌కు కోతపడింది. సంస్థ జనరల్ కౌన్సిల్ రోనాల్డ్ బెల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన హయాంలో హ్యాకింగ్ ఉదంతం చోటుచేసుకున్నందున ఈ ఏడాది తన వార్షిక బోనస్, వార్షిక ఈక్విటీ గ్రాంట్‌లను వదులుకునేందుకు తాను అంగీకరించినట్లు మరిస్సా స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియచేశారు. తనకు రావాల్సిన బోనస్‌ను కష్టపడి పనిచేసే మిగతా ఉద్యోగులకు పంచాలని కంపెనీని కోరినట్లు ఆమె వివరించారు.
2014లో యూజర్ల ఖాతాల హ్యాకింగ్ జరిగినప్పుడు తమ సెక్యూరిటీ బృందానికి అంతా తెలుసంటూ స్వతంత్ర కమిటీ నిర్ధారించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు యాహూ తెలిపింది. అయితే ఉదంతం తర్వాత భద్రతపరమైన చర్యలు అదనంగా అనేకం తీసుకున్నప్పటికీ.. కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ వ్యవహారంపై సరిగ్గా విచారణ జరిపినట్లు కనిపించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.