
న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. తక్షణం దీనిపై విచారణ జరపకపోతే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందన్నారు. కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది డొల్ల కంపెనీలను రద్దు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, డొల్ల కంపెనీలతోనే డీహెచ్‌ఎఫ్‌ఎల్ కుంభకోణానికి పాల్పడిందన్నారు. నియంత్రణ సంస్థలతో సహా ప్రభుత్వ విభాగాలన్నీ ఈ స్కామ్‌ను అరికట్టటంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
భారత్‌లో భారీ కుంభకోణం..!
డీహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీ బ్యాంక్‌ల ద్వారా రూ.97,000 కోట్ల రుణాలు సమీకరించిందని, డొల్ల కంపెనీల నెట్‌వర్క్ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు రూ.31,000 కోట్లు దారి మళ్లించారని పేర్కొంది. భారత్‌లో ఇదే అతి పెద్ద ఆర్థిక కుంభకోణమని కోబ్రాపోస్ట్ వివరించింది.
అవకతవకలకు పాల్పడలేదు...
కాగా కోబ్రాపోస్ట్ కథనాన్ని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఖండించింది. తమ కంపెనీకి, వాటాదారులకు హాని చేసే దురుద్దేశపూరితంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ఒక బాధ్యతాయుత కంపెనీగా నియమ నిబంధనలకనుగుణంగానే రుణాలు ఇచ్చామని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొంది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలన్నీ తమ కంపెనీకి ట్రిపుల్ ఏ రేటింగ్‌ను ఇచ్చాయని, తమ ఖాతా పుస్తకాలను అంతర్జాతీయ ఆడిటర్లు ఆడిట్ చేస్తారని వివరించింది. కాగా బ్యాంక్‌లు కాస్త ఏమరుపాటుగా ఉన్నా, డీహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీ నిధులను దారిమళ్లించిందన్న విషయాన్ని పసిగట్టేవని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. బీఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్ 8% పతనమై రూ.170 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.164ను తాకింది.
రూ.1,375 కోట్ల రుణం విక్రయం...
మరోవైపు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) కంపెనీ రూ.1,375 కోట్ల హోల్‌సేల్ లోన్‌ను అంతర్జాతీయ ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఫండ్, ఓక్‌ట్రీకి విక్రయించింది. కాగా, నివాసిత రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో భారత్‌కు సంబంధించి ఇదే అతి పెద్ద లావాదేవీగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment