
హైదరాబాద్: దేశీ ఐటీ రంగం 2018లో ఆందోళనకరంగానే ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేసింది. గ్లోబల్ ఐటీ వ్యయాలు పెరగడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం వంటి సానుకూలతల నడుమ ఇంకా సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. 2018 ఐటీకి కమ్‌బ్యాక్ ఇయర్ అనే ఊహాగానాలను కొట్టిపారేసింది. ‘అదే సమస్య. వారు పునరుద్ధరణ చాలా వేగంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఊహించిన క్షీణత కానీ ఆకస్మిక మెరుగుదల కానీ ఉండదు’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు.
‘గ్లోబల్ ఎకానమీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటి వల్ల ఇప్పటికిప్పుడు పరిశ్రమకు పెద్దగా అవకాశాలేమీ అందుబాటులోకి రావు’ అని హెచ్చరించారు. సవాళ్లు లేవని అనుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదన్నారు. పాత సవాళ్లు కొనసాగుతున్నాయని, అవి సమసిపోలేదన్నారు. అలాగే అమెరికాలోని పాలన చర్యలు వంటి కొత్తవీ ఉన్నాయని చెప్పారు.