
సాక్షి, వెదురుకుప్పం : కుర్రకారు హుషారు...ఉరకలేసిన కోడె గిత్తలు...అరుపులు కేకలతో జనం చప్పట్లు... ...జన ప్రవాహాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయిన ఎడ్లు... ఇదీ చిత్తూరు జిల్లా వెదురుకుప‍్పం మండలం దామరకుప్పం గ్రామంలో సోమవారం జరిగిన ఎడ్ల పందేలు హోరెత్తించిన తీరు. సై అంటే సై అన్నట్లు ఉత్సాహభరితంగా సాగిన జల్లికట్టు యువతలో నూతన జోష్ ను నింపింది. హోరాహోరీగా సాగిన పరుష పందేలతో సంక్రాంత్రి సంబరాలు మొదలయ్యాయి.
యువత ఆధ‍్వర్యంలో పరుష పందేలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర‍్భంగా పచ్చికాపల్లం, ఎర్రమరాజుపల్లె, కొమరగుంట పరిసర గ్రామాలతో పాటు మండలంలోని నలుమూలల నుంచి యువకులు పెద‍్దఎత్తున పరుష పందేనికి హాజరయ్యారు. ఇందులో భాగంగా పశువులకు పలకలు కట్టి జనంపైకి వదిలారు. కోడె గిత్తలు రంకెలేసుకుంటూ జన ప్రవాహాన్నిచీల్చుకుంటూ యువతకు చిక్కకుండా పరుగులు తీశాయి.
ఉరకలేస్తూ దూసుకుపోయిన కోడె గిత్తలను నిలువరించేందుకు ఉత్సాహంతో యువత సకల ప్రయత్నాలు చేశారు. కొన్ని ఎడ్లు యువత చేతిలో చిక్కుకున్నా పౌరుషం గల పశువులు యువత హుషారును లెక్కచేయకుండా దూసుకెళ్లాయి. పశువుల జోరుకూ యువత హుషారుకు మధ‍్య జరిగిన ఉత్కంఠ పోరులో పశువులదే పైచేయిగా నిలిచింది. ఎడ్ల దూకుడుకు జనం బెంబేలెత్తి పోయారు. ఎడ్ల వేగాన్ని నిరోధించే క్రమంలో కింద పడి కొందరు గాయాలపాలయ్యారు.
నువ్వా..నేనా..!
సోమవారం దామరకుప్పం గ్రామంలో జరిగిన జల్లికట్టు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఉదయం 10 గంటలకే చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో యువత గ్రామానికి చేరుకున్నారు. అంతకు ముందే ఎడ్లకు పలకలు, బెలూన్లు, స్వామి వారి చిత్రాలు అతికించి తయారు చేసిన పలకలతో సిద్ధం చేశారు. ఈక్రమంలో యువత అల్లి వద్ద పలకల కోసం నిలబడ్డ క్రమంలో నిర్వాహకులు ఎడ్లను పరుగు పందేనికి ఉసిగొల్పారు. దీంతో కోడెగిత్తలు రంకెలేసుకుంటూ పరుగులు తీశాయి. కోడెగిత‍్తలు ద్విచక్రవాహనాలపై దూసుకుపోవడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మిద్దెల పై నుంచీ పశువుల పందేలను ఆసక్తికరంగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment