మంత్రి హోదాలో  అసెంబ్లీకి | Ramachandra Reddy, Narayanaswamy To Get Cabinet Berths | Sakshi
Sakshi News home page

మంత్రి హోదాలో అసెంబ్లీకి

Published Thu, Jun 13 2019 12:03 PM | Last Updated on Thu, Jun 13 2019 12:08 PM

Ramachandra Reddy, Narayanaswamy To Get Cabinet Berths  - Sakshi

సాక్షి, తిరుపతి: ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు టీడీపీ ఘోర పరాజయంతో ప్రతిపక్ష నేత హోదాలో బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రి హోదాలో హాజరయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్త వారు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురై రెండోసారి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్‌కే రోజా బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో రాజ్యాంగానికి విరుద్ధంగా 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారికి మంత్రి పదవులు కట్టబెట్టి అసెంబ్లీలో కూర్చొబెట్టుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.

2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్‌కే రోజా, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, వెంకటేగౌడ్, నవాజ్‌ బాషా, ఎంఎస్‌ బాబు ఘన విజయం సాధించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సునామీలో టీడీపీ నేతల అడ్రస్‌లు గల్లంతయ్యాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికి చోటు కల్పించారు. ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిని చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. వీరంతా అమరావతిలో బుధవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. 


కొత్త కొత్తగా.. నిండుగా
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మినహా.. మిగిలిన వారిలో పెద్దిరెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో భాగంగా సుమారు ఏడాదికిపైగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా ఏడాదిపాటు సస్పెండ్‌ చెయ్యడంతో ఆమె అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు.  జిల్లా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారితో పాటు సీనియర్‌ ఎమ్మెల్యేలు బుధవారం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. గతంలో వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలిచి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి పచ్చకండువా కప్పుకున్న అమర్‌నాథ్‌రెడ్డి ఏకంగా మంత్రి అయ్యారని, ఆయనకు పలమనేరు ఓటర్లు గుణపాఠం చెప్పారని జిల్లా వాసులు గుర్తుచేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఏకపక్షంగా వ్యవహరించి.. సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు తెరలేపిన టీడీపీ నేతలకు ఎన్నికల ఫలితాలతో గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement