
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్ వద్ద ఆయన సోమవారం ఉదయం పండుగ వేడుకల్లో ఉత్సాహం పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వైఎస్ జగన్.. పంచె, కండువా ధరించారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సునీల్ కుమార్ రెడ్డి, నారాయణస్వామితో పాటు పార్టీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, పాదయాత్ర బృందం కూడా పాలుపంచుకున్నారు.
కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు వైఎస్ జగన్ ఇవాళ (సోమవారం) విరామం ఇచ్చారు. పారకాల్వ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాదయాత్ర శిబిరంలోనే ఉంటారు.