
సాక్షి, దామలచెరువు: రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని, దీన్ని అంతమొందించాల్సిన అవసరముందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అవినీతి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పవిత్ర దేవాలయాల్లో క్షుద్రపూజలు చేస్తున్నారు, గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు చదువుకున్న స్కూలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను అన్ని రకాలుగా చంద్రబాబు వంచించారని అన్నారు.
మళ్లీ రాజన్న పాలన రావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు వినడానికి రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన జగన్‌కు జనహారతి పలికారని, రాజన్న తనయుడిపై జనంకున్న అభిమానం, మక్కువ, ఆప్యాయతలకు ఇదే నిదర్శనమన్నారు. రాజన్న పాలన వచ్చే వరకు జగన్ వెంటే నడుస్తామని చెవిరెడ్డి అన్నారు.