సాక్షి: క్రికెట్ ప్రేమికులను ఉత్కంఠకు గురిచేస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ జట్టులో ప్రేరణనింపే ప్రయత్నం చేశారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన నాయకత్వ ప్రతిభతో జట్టును ముందుండి విజయతీరాలకు నడిపిస్తాడని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు గురించి అతిగా ఆలోచించకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ఫోకస్ చేయాలని జట్టు సభ్యులకు ఆయన సూచించారు.
పాక్ సారథిగా 1992 ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్‌ఖాన్ తన వ్యక్తిగత అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘నా కెరీర్ ప్రారంభంలో 70శాతం ప్రతిభ, 30శాతం మానసిక బలంతో నేను విజయం సాధించానని భావించాను. కానీ కెరీర్ పూర్తయిన తరువాత ఇది 50-50 శాతం అనుకున్నాను. కానీ, 60శాతం మానసిక బలం, 40శాతం ప్రతిభతో రాణించినట్టు నా మిత్రుడు గవాస్కర్ చెప్పాడు. దానితో నేను ఏకీభవిస్తాను’ అని పేర్కొన్నారు. దాయాదుల పోరు సందర్భంగా ఇరుజట్లు తీవ్ర మానసిక ఒత్తిడిలో మ్యాచ్ ఆడతాయని, ఒత్తిడిని తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారని, అదృష్టవశాత్తు సర్ఫరాజ్ లాంటి సాహసోపేత నాయకుడి ఆధ్వర్యంలో కచ్చితంగా తమ జట్టు విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment