జైపూర్: రాజస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకోవడం కలకలం రేపుతోంది. కేవలం రెండు రోజుల్లోనే పది మంది శిశువులు మృతి చెంది ఆ తల్లులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చారు. కోటలోని జేకేలాన్ ఆసుపత్రిలో డిసెంబరు 23న ఆరుగురు, డిసెంబరు 24న నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు ఆడ శిశువులుండగా, మిగతా ఐదుగురు మగ శిశువులున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలు చేపట్టారు.
ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెండ్ డా.హెచ్‌ఎల్ మీనా మాట్లాడుతూ ‘సాధారణంగా ఆసుపత్రిలో రోజుకు ఒకటి, రెండు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ రెండురోజుల్లో పదిమంది చిన్నారులు మరణించడం బాధాకరం, కానీ సాధారణమే. చాలా వరకు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలని కోరామ’ని పేర్కొన్నాడు. అయితే ఆక్సిజన్ అందక, ఇన్‌ఫెక్షన్ కారణంగా, పలు కారణాల రీత్యా శిశువులు పుట్టిన 48 గంటల్లోనే మృతి చెందారని ఓ వైద్యుడు తెలిపాడు. కాగా ఇదే ఆసుపత్రిలో డిసెంబర్ నెలలోనే ఇప్పటివరకు 77 మంది చిన్నారులు మరణించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment