
బీజింగ్: చైనాలో జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం సంచలన విషయం తెలిపింది. తమకు ప్రజాస్వామ్యం కావాలంటూ 1989 జూన్ నెలలో తియాన్‌మెన్ కూడలి వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 10 వేలమందిని చైనా సైన్యం చంపేసిందని వెల్లడించింది. 'ఆ నాడు జరిగిన ఉద్యమంలో కనీసం 10,000మందిని చంపేసినట్లు అంచనా' అని బ్రిటన్ రాయబారి అలాన్ డోనాల్డ్ లండన్‌కు నాడు పంపిన టెలిగ్రాంలో తెలిపారు.
ఆ విషయానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ఇప్పుడు తాజాగా 28 ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది. చైనాలో కమ్యునిస్టు ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమకు మిగితా దేశాల మాదిరిగా ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటూ దాదాపు ఏడు వారాలపాటు పౌరులు వీధుల్లోకి వచ్చి పోరాడారు. 1989 మే నెల నుంచే ఇది ప్రారంభమైంది. అయితే, జూన్ 5న వారంతా తియాన్‌మెన్ కూడలి వద్దకు చేరుకొని ఉద్యమించగా వారిపై సైన్యం కాల్పులు జరిపింది. ఆ సమయంలో ఒక వెయ్యిమంది చనిపోయారంటూ ప్రపంచాన్ని నమ్మించారు. అయితే, అందుకు పది రెట్లమందిని చంపేసినట్లు నాటి బ్రిటన్ రాయబారి టెలిగ్రాం ద్వారా తాజాగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment