కరోనా మందులతో దందా.. ముఠా అరెస్టు | 7 Nabbed For Illegal Selling Covid Drug Remdesivir In Hyderabad | Sakshi
Sakshi News home page

కరోనా మందులతో దందా.. ముఠా అరెస్టు

Published Sun, Jul 19 2020 11:32 AM | Last Updated on Sun, Jul 19 2020 11:52 AM

7 Nabbed For Illegal Selling Covid Drug Remdesivir In Hyderabad - Sakshi

గోల్కొండ/హైదరాబాద్‌: కోవిడ్‌–19 చికిత్స కోసం వాడే రేమ్‌డిసివీర్, సిఫ్రినీ ఇంజెక్షన్లను అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న ఓ ముఠాను కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... నానల్‌నగర్‌లోని ఆలివ్‌ ఆసుపత్రిలోని ఓపీ ఫార్మసీలో అబ్దుల్‌ అజీజ్‌ పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫార్మసీలో రేమ్‌డిసివీర్‌ (కోవిఫర్‌) ఇంజెక్షన్‌ కోసం జనం అడుగుతుండటంతో వాటిని ఎలాగైనా తెచ్చి అధిక ధరకు అమ్మాలని పథకం వేశాడు.

ఆలివ్‌ హాస్పిటల్‌లోనే స్టాఫ్‌ నర్సుగా పని చేసే ఈ.రాజును కలవగా..  అతను రేమ్‌డిసివీర్‌ను రూ. 19,000 లకు అమ్ముతానని చెప్పాడు. ఎల్బీ నగర్‌లోని మెడిసిస్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేసే ఎల్‌.సునీల్‌ సైతం రెమ్‌డిసివీర్‌ను రూ. 6500  సరఫరా చేస్తున్నాడని తెలిపాడు. అదే విధంగా ఎం.రవి కూడా తాను రూ. 10,000 రెమ్‌డిసీవీర్‌ ఇంజెక్షన్‌ అజీజ్‌కు సరఫరా చేస్తానన్నాడు. కాగా ఈ విధంగా అజీజ్‌ 11 రెమ్‌డిసివీర్‌ ఇంజెక్షన్లతో పాటు ఒక సిఫ్రినీ ఇంజెక్షన్‌ను ఎం.రాజు, ఎం.రవిల వద్ద కొన్నాడు. కాగా వీటిని అజీజ్‌ మహ్మద్‌ మాజిద్‌ అలీకి ఒక్కో ఇంజెక్షన్‌ రూ.20,000లకు అమ్మాడు.

మాజిద్‌ అలీ వీటిని మరో నిందితుడు మహ్మద్‌ అఫాక్‌ అలీకి అధిక ధరలకు అమ్మాలని ఇచ్చాడు. కాగా ఈ ఇంజెక్షన్లను ఆసిఫ్‌నగర్‌లోని సమీర్‌ ఆస్పత్రిలోని ఫార్మసీలో పని చేసే మహ్మద్‌ ఒబెద్‌కు రూ. 28,000 లకు అమ్మాడు.  ఒబెద్‌ సమీర్‌ ఆస్పత్రి యాజమాన్యంతో కుమ్మక్కై వాటిని అధిక ధరలకు అమ్మకానికి పెట్టాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ వి. గట్టు మల్లు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆసిఫ్‌నగర్‌కు వచ్చారు. ఏడుగురు నిందితులు  ఒబెద్, మహ్మద్‌ అఫాక్‌ అలీ, మహ్మద్‌ ఆజిద్‌ అలీ, అబ్దుల్‌ అజీజ్, రాజు,  సునీల్, రవిలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement