
బెంగళూరు: మరికాసేపట్లో కల్యాణ మండపంలో సంతోషంగా గడపాల్సిన వారు అనుకోని విషాదంతో ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కర్ణాటకలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో పెళ్లి ఇంట శోకం తాండవించింది. వివరాలు.... మండ్య జిల్లా మద్దూరులోని శివణపుర వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగే పెళ్లి కోసం యడేనహళ్లి గ్రామవాసులు ఒక సరుకు రవాణా వ్యాన్నుమాట్లాడుకొని ఆదివారం సాయంత్రం బయలుదేరారు. వాహనంలో సుమారు 50 మంది వరకు ఉన్నారు. వాహనం పోరిశెట్టి హళ్లి వద్దకు రాగానే అదుపుతప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది.
దీంతో పెళ్లికూతురు సోదరి పూజా (16)తో పాటు బీరమ్మ (50), సరోజమ్మ (50), జయమ్మ (55), పార్వతమ్మ (45), శివణ్ణ (46) యాదమ్మ (55), శృతి (03)లు అక్కడికక్కడే మరణించారు. మరొకరి వివరాలు తెలియాల్సిఉంది. తీవ్రంగా గాయపడిన 25 మంది ప్రస్తుతం మండ్య, మద్దూరులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను మండ్య ఆస్పత్రికి తరలించారు. కెస్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment