
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. స్థలం కోసం రెండు వర్గాలు ఘర్షణలకు దిగి పరస్పరం కాల్పులు జరిపాయి. బుధవారం జరిగిన ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందగా, 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలకు కూడా ఉన్నారు. దాడిలో కొంతమంది నాటు తుపాకిలు వాడగా.. మరికొంత మంది మారణాయుధాలను ఉపయోగించారు. దీంతో దాడిలో గాయపడ్డ కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.
జిల్లాలోని ఉబ్బా గ్రామంలో ఆస్తి కోసం జరిగిన వివాదంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశామని జల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ తెలిపారు. రెండు వర్గాలకు చెందిన దాదాపు 100 మంది ఒకరిపై ఒకరు దాడికి పాల్పడినట్లు వివరించారు. తాజా ఘటనతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారకులను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది మృతి చెందిన వార్త సంచలనంగా మారడంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ ఘటనపై ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.