ప్రతీకాత్మక చిత్రం
చౌటుప్పల్ (మునుగోడు) : వాళ్లంతా విద్యార్థులు. చదువుకోవాల్సిన వారు జల్సాలకు అలవాటుపడ్డారు. విందులు, వినోదాల పేరిట బలాదూర్ తిరుగుతున్నారు. కల్లు, మద్యం సేవించడం అలవాటు చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు డబ్బు కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే భారీ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ చోరీ జరిగిన దుకాణంలో ఉన్న సీసీకెమెరాలకు చిక్కడంతో వీరి భాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేష్ వెల్లడించారు.
సంస్థాన్‌నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన మేకల రామకృష్ణ(17), మేకల ప్రశాంత్(15), కొప్పు వినోద్(15)లు చదువుకుంటున్నారు. రామకృష్ణ నారాయణపురంలో ఇంటర్ చదువుతుండగా మిగతా ఇద్దరు నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ హైస్కూల్‌లో చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడ్డారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సులువైన మార్గం దొంగతనమేనని భావించారు.
ముందస్తుగా రెక్కీ..
దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్న ఈ ముగ్గురు అనువైన ప్రాంతాల కోసం అన్వేషించారు. తరచుగా సినిమాలు చూసేందుకు చౌటుప్పల్‌కు వచ్చే వీరు ఇక్కడే దొంగతనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 29న అనుకూలమైన దుకాణాల కోసం అన్వేషణ చేశారు. చిన్నకొండూరు చౌరస్తా వద్ద ఉన్న ఎంఎం మొబైల్ దుకాణాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా దుకాణంలోకి రెండుసార్లు వెళ్లి పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించారు. రాత్రి తొమ్మిదిన్నరకు దుకాణం బంద్ కాగానే వెనక భాగం నుంచి పై అంతస్తు మీదుగా లోనికి ప్రవేశించారు. దుకాణంలోని విలువైన 20సెల్‌ఫోన్లు, 35వేల నగదు, ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లారు.
దొంగలను పట్టించిన సీసీకెమెరాలు
మొబైల్ షాపులో దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల చిత్రాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. కెమెరాలు ఉన్న విషయాన్ని అలస్యంగా గుర్తించిన సదరు దొంగలు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేశాలు మార్చారు. కానీ అప్పటికే రికార్డయిన వీరి చిత్రాలు పోలీసులకు పెద్ద ఆధారంగా లభించాయి. సీసీఫూటేజీలను వివిధ స్టేషన్‌లకు పంపించి ఎంక్వైరీ చేసిన పోలీసులకు వీరి వివరాలు లభించాయి.
చోరీసొత్తుతో విందులు, వినోదాలు
సెల్‌ఫోను షాపులో ఎత్తుకెళ్లిన నగదుతో ఈ ముగ్గురు విందులు, వినోదాలు చేసుకున్నారు. సహచర మిత్రులను పిలిచి పార్టీలు ఇచ్చారు. 35వేలల్లో 15వేలను ఖర్చు చేశారు.
వాహన తనిఖీల్లో ..
మండలంలోని దామెర గ్రామం వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు ముగ్గురు బైక్‌పై చౌటుప్పల్ వైపు వస్తున్నారు. పోలీసులను చూడగానే బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద 2లక్షల రూపాయల విలువైన 20 సెల్‌ఫోన్లు, 20వేల నగదు, ఒక ల్యాప్‌టాప్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను అమ్మేందుకు వీలు కాకపోవడంతో చిల్లాపురం గ్రామంలోని తమ బావి వద్ద ఉన్న గుట్టలో ఇంత కాలం దాచిపెట్టారు.ఎలాగైన అమ్మాలని తీసుకువస్తున్న క్రమంలో పట్టుబడ్డారు. వీరు మైనర్లు కావడంతో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నల్లగొండలోని బాల నేరస్తుల న్యాయస్థానానికి తరలించారు. సమావేశంలో సీఐ ఏ.వెంకటయ్య, ఎస్సైలు చిల్లా సాయిలు, నవీన్‌బాబు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment