caught thieves
-
Crime News: బుల్లెట్ బండి మీద కన్నేశారు
పంజగుట్ట: రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పంజగుట్ట క్రైమ్ టీం అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి ఐదు లక్షలు విలువచేసే నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏలూరు జిల్లా, జగ్గారెడ్డిగూడెంకు చెందిన దేవ సన్ని అలియాస్ మహేష్ (26) ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరుకు చెందిన బి.మనోహర్ (21) ఇతనికి నాలుగు సంవత్సరాలుగా స్నేహితులు. త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ద్విచక్రవాహనాలు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఖరీదైన వాహనాలు దొంగిలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు దొంగతనం చేద్దామనుకున్నారు. నగరానికి వచ్చి సరూర్‌నగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్‌తోపాటు గత ఏప్రిల్ నెలలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాఫర్అలీ బాగ్‌లో ఒక వాహనం దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం పంజగుట్ట క్రైమ్ ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనంపై నిందితులు పట్టుబడ్డారు. పత్రాలు చూపించమంటే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా గతంలో చేసిన దొంగతనాలగూర్చి వివరించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు ఎలా అమ్మలి, కొనే వారు ఎవరైనా దొరుకుతారా అని ఎదురుచూస్తుండగానే పోలీసులకు దొరికిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. (చదవండి: 24 గంటలు ఆగాలంటూ..) -
అవసరాల కోసం అడ్డదారులు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: అవసరాల కోసం అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని దొంగతనానికి పాల్పడిన యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఎల్ఆర్ఆర్ 9 ఎంటర్ ప్రైజెస్‌లో నాలుగు రోజుల క్రితం రూ.25 లక్షలు విలువ చేసే బోర్వెల్ బిట్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లేత్‌మిషన్ పనిచేసే దమ్మాయిగూడకు చెందిన హరికృష్ణ(32), వెల్డర్‌గా పనిచేసే కట్టింగ్‌కాలనీకి చెందిన దుర్గేష్ (37) మిత్రులు. హరికృష్ణ ఎల్ఆర్ఆర్9 ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎదురుగా ఉన్న తన సోదరుడి కంపెనీలో పనిచేస్తున్నాడు. వ్యసనాలకు, కుటుంబ అవసరాలకు జీతం సరిపోయేది కాదు. దీంతో నిత్యం ఎదురుగా ఉన్న కంపెనీలో బోర్‌వెల్స్ బిట్స్ లోడింగ్ చేయడాన్ని గమనించేవాడు. బిట్స్‌ను దొంగిలించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. తన ఫ్లాన్‌ను దుర్గేష్‌కు వివరించాడు. అందుకు దుర్గేష్ ఓకే చెప్పడంతో చోరీకి పక్క ప్లాన్ చేశారు. తెలిసిన వారి వద్ద ఓ ఓమీనీ వ్యాన్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. ఆగస్టు 28 రాత్రి 12:30గంటల సమయంలో ఇద్దరు తాళ్లూరి థియేటర్ వద్ద కలుసుకున్నారు. ప్లాన్ ప్రకారం ముందుగానే కంపెనీ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి కంపెనీలోకి ప్రవేశించారు. షట్టర్ ఓపెన్ కాకపోవడంతో కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. విలువైన బిట్స్‌ను దోచుకెళ్లినట్లు డీఐ వివరించారు. సమీప సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు 7 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి బుధవారం వ్యాన్‌లో వెళ్తున్న వారిని చక్రిపురం చౌరస్తా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చదవండి: ఏమైందో? ఏమో?..అనుమానాస్పద స్థితిలో యువతి మృతి -
భారీ దోపిడికి పక్కా ప్లాన్.. ట్విస్ట్ మూములుగా లేదుగా
సాక్షి, బరంపురం( భువనేశ్వర్): జాతీయ రహదారిలో భారీ దోపిడీకి వ్యూహ రచన చేసిన దుండగుల ముఠాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. వీరంతా ఇప్పటికే పదుల సంఖ్యలో వివిధ నేరాల్లో శిక్ష అనుభవించి, విడుదలైన వారని తెలియడంతో స్థానికంగా సంచలనం రేపింది. ఐఐసీ అధికారి సుమిత్‌సరన్ అందించిన సమాచారం ప్రకారం... గంజాం జిల్లా గుసానినువాగం పోలీస్ స్టేషన్ పరిధి కొజిరిపడా సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీకి దుండగులు పథకం పన్నారు. ఇదే సమయంలో గుసానినువాగం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కొందరు తిరుగాడటంతో వెంబడించారు. దుండగులు తప్పించుకొనే ప్రయత్నంగా చేయగా.. వారందరినీ చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 సెల్ఫోన్లు, 3 నాటుబాంబులు, నాటు తుపాకి, 3 తూటాలు, ఇనుపరాడ్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో టైగర్ నొనియా, చోటుకుమార్ నొనియా, రాహుల్‌కుమార్, చందన్ నొనియా, రాజ్‌కుమార్ నొనియా, రొహన్‌కుమార్ నొనియా, బిజయ్‌దాస్, అనుక్‌కుమార్, సహిర్‌ఖాన్‌గా గుర్తించారు. పట్టుబడిన వారంతా ఝార్కండ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మరో దుండగుడు భువనేశ్వర్ బాలకొటి చెందిన నేరస్థుడుగా వెల్లడించారు. అరెస్టయిన వారిపై గతంలో బరంపురం జిల్లా పరిధిలోని పెద్ద బజార్, బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయన్నారు. వాటికి సంబంధించి శిక్ష అనుభవించి, జైలు నుంచి బయటకు వచ్చిన వారేనని వివరించారు. ఈ నేపథ్యంలో నిందుతులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ అధికారి తెలిపారు. -
అమెజాన్‌ను మోసగించిన ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ను మోసగించిన ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆన్లైన్ ద్వారా 300 వస్తువులను ఆర్డర్ చేసి డెలివరీ అయ్యాక.. రాలేదంటూ మోసానికి పాల్పడ్డారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ‘నిందితులు అమెజాన్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి డెలివరీ కాలేదంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు. ఇలా ఒక్కో ఆర్డర్ మీద రెండు వస్తువులను దక్కించుకున్నారు. సెల్ ఫోన్లను బుక్ చేసి డెలివరీ అయ్యాక తక్కువ ధరకు ఓఎల్ఎక్స్లో అమ్ముకున్నారు. ఆర్డర్ చేసిన ప్రతీసారి ఒక కొత్త సిమ్‌ను ఉపయోగించారు. అనుమానం రాకుండే ఉండేందుకు వివిధ ప్రదేశాల నుంచి ఆర్డర్ చేసేశారు. వారి నుంచి 10 లక్షల 75 వేల రూపాయల నగదు, 556 సిమ్ కార్డులు, 42 సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నాం. 800 ఫోన్లు బుక్ చేసి అదనంగా 800 ఫోన్లను దక్కించుకున్నార’ని వివరించారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
చౌటుప్పల్ (మునుగోడు) : వాళ్లంతా విద్యార్థులు. చదువుకోవాల్సిన వారు జల్సాలకు అలవాటుపడ్డారు. విందులు, వినోదాల పేరిట బలాదూర్ తిరుగుతున్నారు. కల్లు, మద్యం సేవించడం అలవాటు చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు డబ్బు కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే భారీ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ చోరీ జరిగిన దుకాణంలో ఉన్న సీసీకెమెరాలకు చిక్కడంతో వీరి భాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామోజు రమేష్ వెల్లడించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన మేకల రామకృష్ణ(17), మేకల ప్రశాంత్(15), కొప్పు వినోద్(15)లు చదువుకుంటున్నారు. రామకృష్ణ నారాయణపురంలో ఇంటర్ చదువుతుండగా మిగతా ఇద్దరు నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ హైస్కూల్లో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడ్డారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సులువైన మార్గం దొంగతనమేనని భావించారు. ముందస్తుగా రెక్కీ.. దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్న ఈ ముగ్గురు అనువైన ప్రాంతాల కోసం అన్వేషించారు. తరచుగా సినిమాలు చూసేందుకు చౌటుప్పల్‌కు వచ్చే వీరు ఇక్కడే దొంగతనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 29న అనుకూలమైన దుకాణాల కోసం అన్వేషణ చేశారు. చిన్నకొండూరు చౌరస్తా వద్ద ఉన్న ఎంఎం మొబైల్ దుకాణాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా దుకాణంలోకి రెండుసార్లు వెళ్లి పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించారు. రాత్రి తొమ్మిదిన్నరకు దుకాణం బంద్ కాగానే వెనక భాగం నుంచి పై అంతస్తు మీదుగా లోనికి ప్రవేశించారు. దుకాణంలోని విలువైన 20సెల్ఫోన్లు, 35వేల నగదు, ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లారు. దొంగలను పట్టించిన సీసీకెమెరాలు మొబైల్ షాపులో దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల చిత్రాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. కెమెరాలు ఉన్న విషయాన్ని అలస్యంగా గుర్తించిన సదరు దొంగలు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేశాలు మార్చారు. కానీ అప్పటికే రికార్డయిన వీరి చిత్రాలు పోలీసులకు పెద్ద ఆధారంగా లభించాయి. సీసీఫూటేజీలను వివిధ స్టేషన్లకు పంపించి ఎంక్వైరీ చేసిన పోలీసులకు వీరి వివరాలు లభించాయి. చోరీసొత్తుతో విందులు, వినోదాలు సెల్‌ఫోను షాపులో ఎత్తుకెళ్లిన నగదుతో ఈ ముగ్గురు విందులు, వినోదాలు చేసుకున్నారు. సహచర మిత్రులను పిలిచి పార్టీలు ఇచ్చారు. 35వేలల్లో 15వేలను ఖర్చు చేశారు. వాహన తనిఖీల్లో .. మండలంలోని దామెర గ్రామం వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు ముగ్గురు బైక్‌పై చౌటుప్పల్ వైపు వస్తున్నారు. పోలీసులను చూడగానే బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద 2లక్షల రూపాయల విలువైన 20 సెల్ఫోన్లు, 20వేల నగదు, ఒక ల్యాప్‌టాప్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను అమ్మేందుకు వీలు కాకపోవడంతో చిల్లాపురం గ్రామంలోని తమ బావి వద్ద ఉన్న గుట్టలో ఇంత కాలం దాచిపెట్టారు.ఎలాగైన అమ్మాలని తీసుకువస్తున్న క్రమంలో పట్టుబడ్డారు. వీరు మైనర్లు కావడంతో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నల్లగొండలోని బాల నేరస్తుల న్యాయస్థానానికి తరలించారు. సమావేశంలో సీఐ ఏ.వెంకటయ్య, ఎస్సైలు చిల్లా సాయిలు, నవీన్‌బాబు, సిబ్బంది ఉన్నారు. -
దొంగలను పట్టించి.. గుంజిళ్లు తీయించిన బామ్మ
ఆమె వయసు 85 ఏళ్లు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసి రిటైరయ్యారు. ఆ వయసులో మామూలుగా ఎవరైనా అయితే కృష్ణా రామా అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఆమె అలా ఊరుకోలేదు. తన ఇంట్లో చొరబడేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను చితకబాడి, పట్టించడమే కాదు.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి, వాళ్లతోటి గుంజిళ్లు తీయించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగింది. ప్రేమలత (85)కు నలుగురు కొడుకులు. వాళ్లంతా ముంబైలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఆమె మాత్రం మధ్యప్రదేశ్‌లోని రత్లాం బ్యాంకు కాలనీలో ఒక్కరే ఉంటారు. మొన్న ఒక రోజు రాత్రి ఆమె ఇంట్లో పడుకుని ఉండగా ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఇంటి ముందున్న గ్రిల్‌ను కోస్తుండగా ఆ శబ్దానికి ఆమెకు మెలకువ వచ్చింది. వెంటనే లేచి ఆమె వాళ్ల మీద ఓ బక్కెట్టుడు నీళ్లు పోశారు. దొంగల్లో ఒకరు ప్రేమలత చెయ్యి పట్టుకోగా, ఆమె పక్కనే ఉన్న కర్ర తీసుకుని వాళ్లిద్దరినీ చితకబాదేస్తూ, చుట్టుపక్కల వాళ్లను తన అరుపులతో లేపారు. దాంతో ఇరుగుపొరుగులు నిద్రలేని, వెంటనే పోలీసులకు తెలిపారు. పది నిమిషాల్లో వాళ్లు వచ్చి దొంగలను పట్టుకున్నారు. దొంగలను గుర్తించడానికి ప్రేమలతను పోలీసు స్టేషన్‌కు పిలిచినప్పుడు ఆమె వాళ్లను గుర్తించడమే కాదు.. వాళ్లతో గుంజిళ్లు కూడా తీయించారు. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు బామ్మగారికి 5వేల రూపాయల రివార్డు, ఒక మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చారు.