దొంగలను పట్టించి.. గుంజిళ్లు తీయించిన బామ్మ
ఆమె వయసు 85 ఏళ్లు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసి రిటైరయ్యారు. ఆ వయసులో మామూలుగా ఎవరైనా అయితే కృష్ణా రామా అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఆమె అలా ఊరుకోలేదు. తన ఇంట్లో చొరబడేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను చితకబాడి, పట్టించడమే కాదు.. పోలీసు స్టేషన్కు వెళ్లి, వాళ్లతోటి గుంజిళ్లు తీయించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని రత్లాంలో జరిగింది.
ప్రేమలత (85)కు నలుగురు కొడుకులు. వాళ్లంతా ముంబైలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఆమె మాత్రం మధ్యప్రదేశ్లోని రత్లాం బ్యాంకు కాలనీలో ఒక్కరే ఉంటారు. మొన్న ఒక రోజు రాత్రి ఆమె ఇంట్లో పడుకుని ఉండగా ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఇంటి ముందున్న గ్రిల్ను కోస్తుండగా ఆ శబ్దానికి ఆమెకు మెలకువ వచ్చింది. వెంటనే లేచి ఆమె వాళ్ల మీద ఓ బక్కెట్టుడు నీళ్లు పోశారు. దొంగల్లో ఒకరు ప్రేమలత చెయ్యి పట్టుకోగా, ఆమె పక్కనే ఉన్న కర్ర తీసుకుని వాళ్లిద్దరినీ చితకబాదేస్తూ, చుట్టుపక్కల వాళ్లను తన అరుపులతో లేపారు.
దాంతో ఇరుగుపొరుగులు నిద్రలేని, వెంటనే పోలీసులకు తెలిపారు. పది నిమిషాల్లో వాళ్లు వచ్చి దొంగలను పట్టుకున్నారు. దొంగలను గుర్తించడానికి ప్రేమలతను పోలీసు స్టేషన్కు పిలిచినప్పుడు ఆమె వాళ్లను గుర్తించడమే కాదు.. వాళ్లతో గుంజిళ్లు కూడా తీయించారు. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు బామ్మగారికి 5వేల రూపాయల రివార్డు, ఒక మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చారు.